దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను బుధవారం రిమ్స్ డైరెక్టర్ నివాసానికి తరలించారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం రాంచీలోని రిమ్స్ పేయింగ్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన్ను... కరోనా ముప్పు నేపథ్యంలో అక్కడి నుంచి డైరెక్టర్ నివాసానికి తరలించినట్టు సీనియర్ అధికారులు తెలిపారు.
లాలూ భద్రత నిమిత్తం వార్డులో నియమించిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. పైగా కొవిడ్-19 వార్డుకు సమీపంలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లాలూకు వైద్య సేవలు అందిస్తున్న డా. ఉమేశ్ ప్రసాద్ తెలిపారు.