హోటళ్లలో బసచేసే రకరకాల వినియోగదార్లను సంతృప్తి పరచటమంటే అషామాషీ కాదు. మామూలు వినియోగదారులకు సరైన సేవలందించటానికే ఎంతో శ్రమిస్తుంటారు హోటల్ నిర్వాహకులు. అలాంటి పరిస్థితుల్లో.. అహ్మదాబాద్‌లోని ఓ హోటల్‌కు అమెరికా నుంచి విశిష్ట అతిథి ఒకరు వచ్చారు. కుటుంబం మొత్తాన్ని వెంటబెట్టుకొచ్చారామె. కుటుంబం అంటే భర్త, పిల్లలు కాదండీ బాబూ... 6 పిల్లులు, ఓ కుక్క, ఆరు కుక్కపిల్లలు, ఓ మేక.. ఇలా అన్నీ కలిపి 14 జంతువులను వెంట తీసుకొచ్చి హోటళ్లో దిగారా జంతు ప్రేమికురాలు. ఇక ఆ తర్వాత చూడాలి.
అమెరికా మహిళ దిగాక గానీ ఆమె వెంట అన్ని జంతువులున్న సంగతి తెలియలేదు హోటల్ నిర్వాహకులకు. వాటికి ఆశ్రయం కల్పించలేమని హోటల్ యాజమాన్యం తేల్చిచెప్పింది. ఖాళీ చేయమంది. ఏప్రిల్ 11వరకు బస చేసేందుకు వీలుగా గది బుక్ చేసుకున్నానని గుర్తుచేశారు ఆ మహిళ. అయినా హోటల్ యజమాని వినలేదు. ఆగ్రహంతో ఆమె ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందకపోవటం వల్ల చివరకు ఇరువురికీ రాజీ కుదిర్చారు. ఆవిడ హోటల్ ఖాళీ చేసి కేరళ వెళ్లిపోయారు.
"ఒక యువకుడు వచ్చాడు. విదేశీ వనితకు గది కావాలని అడిగాడు. తక్కువ ధరలో కావాలన్నాడు. మేం అన్ని అనుమతులున్నందున సరేనన్నాం. అరగంట తర్వాత ఆమెను తీసుకొచ్చాడు. మా వాచ్‌మన్ ఏమీ అనలేకపోయాడు. గది అప్పగించాడు. మాకు ఉదయం కానీ తెలియలేదు ఆవిడ వెంట చాలా జంతువులున్నాయని. గదంతా పాడు చేస్తున్నందున దయచేసి ఖాళీ చేయాలని అడిగాం. ఇతర వినియోగదారులకూ చాలా ఇబ్బంది కలిగింది. ఖాళీ చేయకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నాం. ఆవిడ మీరు చేయటం కాదు నేనే చేస్తానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చారు. వాళ్లు మాట్లాడారు. చివరకు ఆవిడ హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆమె కేరళకు వెళ్తున్నట్లు చెప్పారు."
-ప్రదీప్ అగర్వాల్,హోటల్ మేనేజర్
కేరళ హోటళ్ల మేనేజర్లూ.. ఇక మీ వంతు.