'గగన్యాన్' పనులను వేగవంతం చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో. వ్యోమగాములకు అవసరమైన ఆహారాన్ని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్లో సిద్ధం చేయిస్తోంది.
2022లో ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో. ఈ కార్యక్రమానికి సంబంధించి విడిభాగాల తయారీ, సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి, వ్యోమగాముల శిక్షణ, అవసరమైన వనరులను సమకూర్చడం వంటి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యోమగాములకు అవసరమైన ఆహారాన్ని రక్షణ ఆహార పరిశోధన కేంద్రంలో ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు.
వ్యోమగాములకు ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, ఇడ్లీ, వెజ్ పులావ్, హల్వా వంటి పదార్ధాలను అందించనున్నారు. వ్యోమనౌకలో వేడివేడిగా ఆరగించేందుకు ఆహారాన్ని వేడిచేసే హీటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
గురుత్వాకర్షణ శక్తి లేని స్థితిలో మంచినీళ్లు కూడా తేలియాడతాయి. ఈ నేపథ్యంలో నీళ్లు, పళ్లరసాలు వంటి వాటిని తాగేందుకు ప్రత్యేక ప్యాకెట్లు రూపొందించారు.
ఇదీ చూడండి: రూ.58 వేలు విలువైన పరికరం రూ.500కే తయార్!