కార్గిల్ యుద్ధం ముగిశాక టైగర్ హిల్స్ పర్వతాలపై భారత సైనికులు గాలింపు చేపట్టగా.. ఓ లేఖ దొరికింది. అందులో 'ప్రియమైన గులాం.. నీ నుంచి లేఖ వచ్చి ఎన్నాళ్లైంది. గతంలో కూడా నువ్వు రాసిన అన్ని లేఖలు ఒకే సారి వచ్చాయి. త్వరలో నువ్వు ఉన్నత శిఖరాలపై ఉంటావని ఆశిస్తున్నాను..' అంటూ ఆ లేఖ కొనసాగింది. అది పాకిస్థాన్ 8వ నార్తన్ లైట్ ఇన్‌ఫ్రాంట్రీకి చెందిన నాయక్ గులాం అబ్బాస్‌కు నీలం లోయలోని అతని తండ్రి రాసిన లేఖ. అందులో ఏడు సార్లు 'దువా'(ప్రార్థన) చేస్తున్నాను అని ఉంది. కార్గిల్ యుద్ధం తర్వాత అక్కడ మృతి చెందిన వారు తమ దేశ సైనికులని పాక్ అంగీకరించలేదు. అక్కడ పాక్ సైనికుల జీతం తదితర అంశాలు రాసే 'పేబుక్'లు భారత దళాలకు లభించాయి.
పాక్ సైనికులకు భారత్ అంత్యక్రియలు..
అయినా, పాక్ వారి సైనికుల ప్రాణ త్యాగాలకు విలువ ఇవ్వలేదు. శత్రువైనా.. వారు కూడా సైనికులే కావడంతో భారత్ సైన్యమే వారికి మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. ఇదంతా ఎందుకు వివరిస్తున్నామంటే.. సైనిక దళాలకు త్యాగాలు, కీర్తి ప్రతిష్ఠలు ఎంతో ముఖ్యమైనవి. దళాల్లోని వారు వీటి కోసమే ప్రాణత్యాగాలకు సిద్ధపడతారు.. వాటికి గుర్తింపు కోరుకుంటారు. అందుకే చరిత్రను చూస్తే ప్రత్యర్థుల సైనికులకు కూడా గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేసిన దేశాలు ఉన్నాయి. చాలా కొద్ది దేశాలు మాత్రమే వారి సైనికులు చేసిన త్యాగాలను బయటకు వెల్లడించుకొనేందుకు నామోషీ పడతాయి. మృతుల సంఖ్యపై లెక్కలు వేసుకొంటాయి.. తమ దళాలు ఎక్కువ మంది ప్రత్యర్థులను మట్టుపెడితే మాత్రం ఘనంగా చెప్పుకొంటాయి.. లేకపోతే అసలు కిమ్మనవు.
భారత్ ఎందుకు వెల్లడించింది..
భారత్ చరిత్రను పరిశీలిస్తే ఏనాడు సైన్యం త్యాగాలను గెలుపు ఓటములతో ముడిపెట్టి చూడలేదు. వారిని దేశం కోసం పోరాడిన ముద్దుబిడ్డలుగానే చూసింది. 1962 చైనా యుద్ధంలో రజాంగ్ లా వద్ద వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సైతాన్ సింగ్‌కు సైన్యంలో అత్యున్నతమైన పరమ్ వీరు చక్ర అవార్డు ప్రకటించింది. ఆ తర్వాత ఆయన పేరును ఓ చమురు ట్యాంకర్‌కు కూడా పెట్టారు. ప్రభుత్వం అవార్డుల జాబితాను ఉంచే gallantryawards.gov.inలోకి వెళ్లగానే తొలుత సైతాన్ సింగ్ పేరే కనిపిస్తుంది. చైనాతో యుద్ధంలో పోరాడిన రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్‌కు మహా వీర్ చక్ర లభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే అవుతుంది.
భారత్ ప్రజాస్వామ్య దేశం. అందుకే ఇక్కడ ప్రతిదానికి లెక్కచెప్పాలి. బాలాకోట్ అనంతరం జరిగిన పరిణామాల్లో అభినందన్ వర్థమాన్ విమానం పాక్‌లో కూలిపోగానే భారత్ ఆ విషయాన్ని ధ్రవీకరించుకొన్న వెంటనే ప్రపంచానికి వెల్లడించింది. అదే సమయంలో పాక్ ఎఫ్16 కూలినా.. ఆ విషయాన్ని వెల్లడించలేదు. భారత వాయుసేన వద్ద రాడార్ సిగ్నెచర్ నుంచి ఎఫ్16 అదృశ్యమైనట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా పాక్ బుకాయించింది.
1962 గురించి మాట్లాడే చైనా.. 1967ను ప్రస్తావించదు..
చైనా మాట్లాడితే 1962లో భారత్‌ను ఓడించామని గొప్పగా చెప్పుకొని ఎంత మంది చనిపోయారో లెక్కలతో సహా చెబుతుంది. కానీ, 1967లో జరిగిన రెండో ఇండో-చైనా యుద్ధం గురించి మాత్రం నోరు మెదపదు. 1967 సెప్టెంబర్11న సిక్కిం సమీపంలోని నాధులా స్థావరంపై చైనా సైన్యం దాడి చేసింది. భారత్ దళాలకు ఇక్కడ వ్యూహాత్మక ఆధిపత్యం లభించింది. దీంతో చైనా వెనక్కి తగ్గింది. మరో పక్షం రోజులు ఆగాక అక్టోబర్1న చోలా స్థావరంపై దాడికి తెగబడింది. ఇక్కడ కూడా భారత సైన్యం తిప్పి కొట్టడంతో ఒక్కరోజులోనే వెనక్కి తగ్గింది. ఈ రెండు ఘర్షణల్లో భారత్ తరపున పోరాడిన 88 మంది మృతి చెందగా.. చైనా తరపున పోరాడిన 340 మంది వరకు మృతి చెందారు. దాదాపు 450 మంది గాయపడ్డారు.
చైనా ఎప్పుడూ నిజం చెప్పదు!
చైనా మాత్రం ఇప్పటికీ ఈ సంఖ్యను కచ్చితంగా చెప్పదు. చోలా వద్ద మృతుల వివరాలు వెల్లడించలేదు. తాజాగా గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో కూడా చైనా సైనికుల ప్రాణ నష్టాలను వెల్లడించడం లేదు. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హుషీజిన్ మాత్రం సైనికుల మరణాలను లెక్కలేసి ఇరు దేశాల ప్రజలను రెచ్చగొట్టడం ఇష్టంలేకే బహిర్గతం చేయడంలేదని.. ఇది బీజింగ్ మంచి తనం అంటూ పేర్కొన్నారు. సైన్యంలో తమ వైపు కూడా నష్టం వాటిల్లిందని క్లుప్తంగా చెప్పారు.
పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఘర్షణ..?
భారత్-చైనా దళాలకు సోమవారం రాత్రి గల్వాన్ లోయలోని భారత భూభాగంలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. సాధారణంగా సైన్యంలో గస్తీకి వెళ్లే బృందాలు రెండుగా విడిపోతాయి. వీటిల్లో తొలి బృందం చిన్నదిగా.. రెండో బృందం కొంత పెద్దదిగా ఉంటుంది. మొదటి బృందానికి ఏమైనా అనుకోని అపాయం వాటిల్లితే రక్షించేలా రెండో బృందం ఉంటుంది. మరోపక్క అప్పటికే అక్కడ చైనా సైనికులు భారీ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఘర్షణకు కారణాలు కచ్చితంగా వెల్లడికాలేదు. ఒక వైపు లోయతో చాలా ఇరుగ్గా ఉన్న మార్గంలో ఘర్షణ చోటు చేసుకొంది. చాలా మంది పర్వతంపై నుంచి కిందపడి గాయపడ్డారు. తీవ్ర చలిలో గాయపడితే వెంటనే శరీరంలో ఉష్ణోగ్రత వేగంగా తగ్గి ప్రాణం పోవడాన్ని హైపోథెర్మియా అంటారు. భారత సైనికులు కూడా దీనికి గురయ్యారు. లోయలో పడి గాయాలపాలైన వారిని గుర్తించడం కూడా ఇక్కడ కష్టతరమే. ఈ ఘర్షణల్లో చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగిందన్నది వాస్తవం.
ఇదీ చూడండి: ' కరోనా యోధులకు వేతనాలు ఇచ్చేలా చూడాలి'