వ్యవసాయ వాణిజ్యంలో అత్యాధునిక పద్ధతులు, ఆహార ప్రమాణాలను పాటించడం ఇప్పుడు పేద దేశాల రైతులకు సవాలుగా మారుతోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా వంటివి నిర్వచిస్తున్న కొత్త ఆహార ప్రమాణాలకు తగ్గట్లు పండించలేక, ఉత్పత్తులు ఎగుమతి చేయలేక పేద దేశాల్లో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో భారత్ వంటి దేశాలు వ్యవసాయ ఎగుమతులు పెంపొందించుకోవాలంటే ప్రపంచ ఆహార ప్రమాణాలను సాధించడంతోపాటు సేంద్రియ వ్యవసాయ విధానాలను ఇతోధికంగా ప్రోత్సహించాలి. ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యూటీఓ) నిబంధనల మేరకు వ్యవసాయ ఎగుమతులు చేయడానికి దేశీయంగా రైతులకు అవగాహన కల్పించడం ముఖ్యం. ఈ దిశగా దేశంలో పటిష్ఠ కార్యాచరణ రూపుదిద్దుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
క్రిమి సంహారకాలతో అనర్థాలు
ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవసాయ ఒప్పందం అమలులోకి వచ్చాక పలు దేశాల మధ్య ఎగుమతి నిబంధనలు మారిపోతున్నాయి. ఆహార ప్రమాణాలకు సంపన్న దేశాలు కొత్త భాష్యం చెబుతున్నాయి. తగిన సాంకేతికత లేని కారణంగా పేద దేశాల రైతులు ఈ ప్రమాణాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఫలితంగా ప్రపంచ విపణిలో మంచి ధరలు దక్కక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మరోవైపు, ఆహార ప్రమాణాల సాధనకు భారత్ కృషి ఆరంభించింది. పంటలపై విష రసాయనాలను ఇష్టానుసారం చల్లుకుంటూపోతే- వాటి అవశేషాలు ఏళ్ల తరబడి పండ్లు, కూరగాయల్లో ఉండి, తింటున్న ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అవశేషాలు ఆహారం ద్వారా నిత్యం స్వల్ప మొత్తాల్లో శరీరంలోకి ప్రవేశించి దీర్ఘకాలంలో క్యాన్సర్ సహా పలు దుష్ప్రభావాలు కలిగిస్తాయి. పర్యావరణాన్నీ కలుషితం చేస్తున్నాయి. అందువల్ల రసాయనాలు, క్రిమిసంహారకాల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరించడమే మార్గం. ఒక అంచనా ప్రకారం 2018లో భారత్‌లో రూ.19,700 కోట్ల విలువైన క్రిమిసంహారకాలను వినియోగించారు. ఇది 2024నాటికి రూ.31,600 కోట్ల విలువైన ఉత్పత్తుల వాడకానికి దారితీయవచ్చనే అంచనాలు దడ పుట్టిస్తున్నాయి. భారత్‌లో 45శాతం పురుగు మందులు ఒక్క పత్తి పంటలోనే వాడుతున్నారు. చైనా, అమెరికా తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో వాడకం తక్కువగా ఉన్నప్పటికీ అది ప్రమాదకర స్థితిలోనే ఉంది. ఈ కారణంగానే రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులనే ధనిక దేశాలు కోరుకుంటున్నాయి. ప్రమాణాల విషయంలో ఒక్కో దేశం ఒక్కోరకంగా స్పందిస్తుండటం వల్ల మన ఎగుమతిదారులకు సమస్యలు తప్పడం లేదు.
ఆహార నాణ్యత విషయంలో డేగకళ్లతో చూసే అమెరికా వంటి దేశాల వైఖరితో ‘ఫైటోశానిటరీ’ (అంతర్జాతీయ వాణిజ్య ప్రమాణాల) పత్రాలు లేని విదేశీ ఉత్పత్తులున్న నౌకలను రేవుల్లోనే నిలిపివేస్తున్నారు. ఈ పరిణామాల వల్ల వర్ధమాన దేశాల రైతులే దెబ్బతింటున్నారు. భారత్ నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతులకు దేశాలవారీగా ప్రమాణాలను గుర్తించి రైతులు, ఎగుమతిదారులకు కావలసిన మౌలిక వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చొరవ చూపుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, హరియాణాలు ఈ విషయంలో ముందున్నాయి. ఆయా రాష్ట్రాల ఉద్యానబోర్డులతో కలిసి భారత వ్యవసాయోత్పత్తుల ఎగుమతులసంస్థ (అపెడా) రైతుల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. అంతర్జాతీయంగా ముఖ్యంగా పశ్చిమ దేశాల మార్కెట్లే లక్ష్యంగా రసాయన అవశేషాలు లేని పండ్లు, కూరగాయలను ఎగుమతి చేసేందుకు రాష్ట్రంలో 18 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. దేశ పండ్ల ఎగుమతుల్లో 65 శాతం, కూరగాయల ఎగుమతుల్లో 55 శాతం వాటా మహారాష్ట్రదే. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల పద్దులో గతేడాది రూ.7,000 కోట్ల విలువైన ఉల్లి, ద్రాక్ష, మామిడి, దానిమ్మ మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఎగుమతయ్యాయి. దేశంలోని మొత్తం ప్యాక్‌హౌస్‌లలో 80 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్రం శీతల గిడ్డంగులు, రైపనింగ్ ఛాంబర్లు, క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా తదితర మౌలిక వసతులను కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఉద్యాన ఎగుమతుల విషయంలో మొదటి నుంచి రైతుల్ని ప్రోత్సహిస్తున్న ఆ రాష్ట్రం తరహాలో ఇతర రాష్ట్రాలూ శ్రద్ధ వహిస్తే దేశం నుంచి ఎగుమతులు ఊపందుకునే అవకాశముంది.
సంపన్న దేశాలు డబ్ల్యూటీఓలో నిర్దేశించిన ఫైటోశానిటరీ నిబంధనల మేరకు ఆహార ప్రమాణాలు పాటించడం భారత్ వంటి సంప్రదాయ వ్యవసాయ దేశాలకు కొంచెం కష్టమైన పనే. ఫైటోశానిటరీ ప్రమాణాల మేరకు ఆహారోత్పత్తుల్లో విషపదార్థాల అవశేషాలు ఏ మాత్రం ఉండరాదు. గతంలో మిర్చి, ద్రాక్ష పంటలను భారత్ ఐరోపా సమాఖ్య దేశాలకు ఎగుమతి చేసింది. రసాయన అవశేషాల కారణంగా అవి తిరస్కరణకు గురవడంతో మన రైతులు అపారంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. పండ్లు, కూరగాయలే కాకుండా వాటిని ప్యాకింగ్‌చేసే కాగితపు పెట్టెల ద్వారా కూడా ఈ అవశేషాలు వ్యాపిస్తాయంటూ వాటికీ నిబంధనలు వర్తింపజేయడంతో ఆ ఎగుమతి ప్రమాణాలను అందుకోవడం మన రైతులకు తలకు మించిన భారమవుతోంది. గతంలో హైదరాబాద్ ద్రాక్ష రైతులకు ఈ విషయంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సాంకేతికతను అందిపుచ్చుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు ఎగుమతి చేసినప్పటికీ అక్కడ దక్కే ధరలతో పోలిస్తే నిబంధనలు పాటించకుండా ద్రాక్షను స్థానికంగా విక్రయించుకున్నా తమకు గిట్టుబాటు అవుతుండటంతో ఎగుమతి చేయడం మానేశామని పలువురు హైదరాబాద్ ద్రాక్ష రైతులు వాపోయారు. అలానే పండు ఈగ (ఫ్రూట్ ఫ్లై), టెంకె పురుగు కారణంగా మామిడి పండ్లూ మార్కెట్ తిరస్కరణకు గురవుతున్నాయి. ప్రపంచ మామిడి ఉత్పత్తిలో దాదాపు 60శాతానికి పైగా ఉత్పత్తి చేస్తున్న భారత్ ఏటా లక్ష టన్నులు మాత్రమే ఎగుమతి చేయగలుగుతుండటం గమనార్హం. జపాన్‌కు ఎగుమతయ్యే మామిడిని ఆవిరి ద్వారా శుభ్రపరచేందుకు వేపర్‌హీట్ శుద్ధి చేయాలి. అమెరికా, ఈయూ దేశాలకైతే ‘ఇర్రాడియేషన్’ చేయించి ఎగుమతి చేయించాలి. త్వరగా చెడిపోయే స్వభావమున్న ధాన్యాలు, చింతపండు, పసుపు, కారంతో పాటు ఉల్లి, వెల్లుల్లి, అన్నిరకాల పండ్లు, కూరగాయల్లో హానికారకాలైన సూక్ష్మజీవుల(బ్యాక్టీరియా)ను నాశనం చేయడం, తేమ శాతాన్ని తగ్గించడం ద్వారా నెలల తరబడి పురుగు పట్టకుండా ‘ఇర్రాడియేషన్’ చేయిస్తారు. దీనివల్ల ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంతో పాటు వాటి జీవితకాలం పెరుగుతుంది కాబట్టి, మంచి ధరలు వచ్చేవరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ ధ్రువపత్రం ఉంటే నేరుగా పశ్చిమదేశాలకు ఎగుమతి చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వేపర్‌శుద్ధి రెండుచోట్లా ఉన్నప్పటికీ ‘ఇర్రాడియేషన్’ ఒక్క హైదరాబాద్‌లోనే ఉంది. మహారాష్ట్రలో లాసల్‌గావ్, వాషీ, సాంగ్లీలలో ఈ ప్లాంట్లున్నాయి. ఎగుమతికి అనుగుణంగా పండ్లు, కూరగాయల నాణ్యతను పాటించడం, వాటి శుభ్రత, గ్రేడింగ్, ప్యాకింగ్, శీతలీకరణ వరకు ప్రత్యేక పద్ధతులు అనుసరించడంతో పాటు సురక్షిత రవాణా కూడా చేయగలగాలి. ఇవన్నీ సాధ్యమైతేనే అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరలు దక్కుతాయి. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న భారత్‌కు అపార ఎగుమతి అవకాశాలున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలంటే పంటకోత అనంతర సాంకేతికతను రైతులకు అందించడం ఒక్కటే మార్గం.
సాంకేతిక పరిజ్ఞానం కీలకం
పండ్లు, కూరగాయల్లో నాణ్యత పెంచేందుకు ఎన్నో మంచి అవకాశాలున్నాయి. సస్యరక్షణ మందులు చల్లాక పంట కోయకుండా కొద్దికాలం వేచి చూస్తే అవశేషాలు నిర్ధారించిన పరిమితులకు మించకుండా ఉంటాయి. అలానే తక్కువకాలంలో విష ప్రభావం తగ్గిపోయే అవకాశమున్న నానో, బయో కెమికల్స్‌ను పరిమితంగా వాడుకోవచ్చు. ఇలాంటి విషయాలపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం, దేశంలో పండ్లు, కూరగాయలు బాగా పండించే ప్రాంతాలను గుర్తించి వాటిని క్లస్టర్లుగా విభజించాలి. కొన్ని క్లస్టర్లకు ఒక ఎగుమతి జోన్ ఏర్పాటు చేసి- ప్రతి జోన్‌కూ ఒక ఇర్రాడియేషన్, వేపర్‌హీట్ శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వమే నెలకొల్పడమో, లేదా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడమో చేయాలి. ఉత్పత్తుల శీతల రవాణా కోసం ఈ జోన్లకు సీఏ కంటెయినర్లు సమకూర్చాలి. ఉత్పత్తుల నాణ్యత పెంచుకునేందుకు, ఎగుమతులకు తగ్గ ప్రమాణాలను అందుకునేందుకు ప్రభుత్వంతోపాటు అపెడా, రైతులు, ఎగుమతిదారులకు అవగాహన కల్పించడం అవసరం. పండించే ఉత్పత్తులు రసాయన అవశేషాలు లేని విధంగా రైతులకు పురుగుమందుల పిచికారీ, సమతుల ఎరువుల వాడకం, సేంద్రియ సేద్య పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. పంటకోత అనంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ముఖ్యం. ఇలాంటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. బహుళపక్ష వాణిజ్యంలో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకోవడం సహజమే. దేశీయ రైతుల్ని ప్రపంచ మార్కెట్లో పోటీపడే విధంగా తీర్చిదిద్దడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెనుసవాలు!
మౌలిక వసతులే చుక్కానిగా...
మన దేశంలో రైతు స్థాయిలో ఎగుమతులు పెరగడం లేదు. ఎగుమతులకు అనువైన నాణ్యత ప్రమాణాలు సాధించలేకపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. మట్టి వాసన ఉందంటూ రొయ్యలు; టెంకె పురుగు, పండు ఈగ సాకుతో మామిడి; మట్టి, బూజు కారణంగా పొగాకు, ద్రాక్ష; అఫ్లోటాక్సిన్, ఇటుక రాతి పొడి కారణంగా మిర్చి వంటి పంటల్లో వేలకోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు తిరస్కరణకు గురవుతుండటం విషాదం. 2008లో ఒకసారి భారత్‌నుంచి లక్ష టన్నుల ద్రాక్షను ఎగుమతి చేస్తే వాటిలో 30 వేల టన్నుల పంటను తిరస్కరించారు. వాటి విలువ అప్పటి ధరల ప్రకారం సుమారు రూ.300 కోట్లు. ద్రాక్షలో అధికోత్పత్తి కోసం వాడే సీసీసీ (సైకోసెల్) అనే ద్రావకం కారణంగా రసాయనాలు పరిమితికి మించి ఉండటమే ఈ తిరస్కరణకు కారణం. సాధారణంగా ఈ ద్రావకం అవశేషాలు ద్రాక్షలో ఏడాది పాటు ఉంటాయి. ఇక్కడ మన రైతులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఉత్పత్తి పెంచాలంటే మందులే వాడాల్సిన అవసరం లేదు. ఇతర మార్గాలూ ఉన్నాయి. వాటిని అనుసరిస్తే పెట్టుబడులు తగ్గించుకోవడమే కాకుండా రసాయన అవశేషాలు ఉత్పత్తిలో లేకుండా జాగ్రత్తపడవచ్చు. ఉదాహరణకు ద్రాక్షలో సీసీసీ ద్రావకం వాడకుండా పంటకు తాత్కాలికంగా నీటిఎద్దడిని సృష్టించడం, ఒకనొక దశలో కొమ్మలను పెంచేసి తరవాత కత్తిరించేయడం, నాణ్యత పెరిగేలా చూడటం... వంటి చర్యలతో ఉత్పత్తిని పెంచే ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితోపాటు సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని రైతులూ గుర్తించాలి.
రచయిత: అమిర్నేని హరికృష్ణ
ఇదీ చూడండి: ఈ నెల 24న భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్