తూర్పు తీర రాష్ట్రాలు ఒడిశా, బంగాల్లో బీభత్సం సృష్టించిన ఫొని తుపాను నేడు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసోం ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. కావలసిన చర్యలను చేపట్టాలని ఆదేశించింది. నేడు, రేపు పశ్చిమ, మధ్య అసోం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
అసోం విపత్తు నిర్వహణ దళం అధికారులు 40 ప్రాంతాల్లో మోహరించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కచార్, బార్పేట, బోన్గయిగావ్, సోనిత్పూర్, తిన్సుకియా, జొర్హత్ జిల్లాలకు చేరుకున్నారు. బాధితులను కాపాడేందుకు ఆరు, కనీస అవసరాలు అందించేందుకు మరో ఐదు హెలికాప్టర్లను సిద్ధం చేశారు. తుపాను సహాయార్థం కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. బాధితులు 1070, 1077, 1079 నెంబర్లకు కాల్ చేయొచ్చని పేర్కొన్నారు.
ఐఈఈఎమ్ఏ సాయం
ఫొని బాధిత రాష్ట్రం ఒడిశాకు చేయూతనందిస్తామని భారత ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంఘం(ఐఈఈఎమ్ఏ) వెల్లడించింది. వేగంగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ముందుకొచ్చింది. ముందుగా అత్యంత అవసరమైన ప్రాంతాల్లో చర్యలు చేపడతామని పేర్కొంది.
టెలికాం విభాగం సమీక్ష
తుపాను బాధిత రాష్ట్రాల్లో టెలికాం సేవలపై సమాచార శాఖ సమీక్షించింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో టెలికాం సేవల పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేసింది. ధ్వంసమైన చోట్ల వివిధ నెట్‌వర్క్‌ల మధ్య ఉచిత ఫోన్కాల్లకు అనుమతించింది. అత్యవసర సేవల కోసం 1938 నెంబర్‌ను ఏర్పాటు చేసింది.
ఇదీ చూడండి: నదిలోకి విమానం- ప్రయాణికులు సురక్షితం