ఉత్తరాది రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలకు పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆదివారం దాదాపు 45వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 150 పునరావాస కేంద్రాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా మందసౌర్, నీమచ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాజస్థాన్లో పలు ప్రాంతాలు జలమయం
వరద నీటి ఉద్ధృతితో రాజస్థాన్లోని పలు జిల్లాల్లో ఆనకట్టల గేట్లు ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చిత్తోర్గఢ్, కోటలో వందాలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు ఇంటిపై కప్పుపై తలదాచుకున్నారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.
పాఠశాలలో చిక్కుకున్న 300మంది విద్యార్థులు
చిత్తోర్గఢ్ జిల్లా రావత్భాటా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల భవనంలో 300మందికి పైగా విద్యార్థులు, 25మంది ఉపాధ్యాయులు చిక్కుకున్నారు. వరదల కారణంగా ఆ ప్రాంతమంతా జలదిగ్బంధం అయినందు వల్ల వారు బయటికి రాలేక పోతున్నారు. వాళ్లందరికీ ఆహార, నీటి సరఫరా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:దైవంగా భావించే శ్వేతనాగుని చూస్తారా?