మహారాష్ట్ర పుణె జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుధవారం ఒక్కసారిగా కుండపోత వాన కురిసిన నేపథ్యంలో పుణె వరద గుప్పిట్లో చిక్కుకుంది. వరద ఉద్ధృతికి జిల్లాలో 12 మంది మృత్యువాత పడ్డారు. పుణె నగరంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 8 మంది మరణించారు. జిల్లావ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 10వేల 5 వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
గోడ కూలి..
పుణెలో అరుణేశ్వర్లో బుధవారం రాత్రి గోడ కూలి ఐదుగురు మరణించారు. మృతుల్లో 9 ఏళ్ల బాలుడు ఉన్నాడు. సహకార్ నగర్లో ఓ పాఠశాల వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభించింది. సింఘార్ రోడ్డులో కొట్టుకొచ్చిన కారులో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.
వందలాది వాహనాలు ధ్వంసం
వరద ఉద్ధృతికి పుణెలో 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. పుణె వీధులు వరద విధ్వంసకాండకు ప్రతిరూపంగా నిలిచాయి. ఇళ్ల వద్ద నిలిపిన వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. భారీ ఎత్తున చెత్త రోడ్లపై చేరింది.
గురువారం ఉదయం వరుణుడు శాంతించినా లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పుణె, బారామతిలో ఎన్డీఆర్ఎప్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
సీఎం విచారం
వరదల్లో మృతిచెందినవారి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవిస్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: కుమార్తె కోసం చెరువునే కడిగేసిన తండ్రి..!