ఉత్తర, ఈశాన్య భారతదేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి బిహార్, అసోం, మేఘాలయల్లో ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వచ్చే మూడు రోజుల పాటు కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ విభాగం.
ఉత్తర భారత్లోని ఘగ్గర్నది 50 అడుగుల మేర ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో సుమారు 2 వేల ఎకరాలకు పైగా పంట భూములు నీటమునిగాయి. సమీప గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. భయంతో ప్రజలు గ్రామాలను వీడి వలస పోతున్నారు. బాధితుల సహాయార్థం సైన్యాన్ని పంజాబ్లోని సంగ్రూరు జిల్లాకు తరలించారు.
దేశరాజధాని దిల్లీలో తాజాగా భారీ వర్షాలు (12.1 మి.మీ) కురిశాయి. ఫలితంగా ఉష్ణోగ్రత, వాతావరణ కాలుష్యం తగ్గుముఖం పట్టాయి.
బిహార్లో 78కి చేరిన మృతుల సంఖ్య
బిహార్లలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వరదల ధాటికి ఇప్పటి వరకు 78 మంది మరణించారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
అసోంలో..
అసోంలో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అక్కడ ఇప్పటికీ 28 జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు 36 మంది మరణించారు. 54 లక్షల మంది ప్రాణరక్షణ కోసం సురక్షిత ప్రదేశాలకు వలసపోయారని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది.
వన్యప్రాణులకు ఎంత కష్టం..
అసోం.. బార్పేట జిల్లాను వరదలు అతలాకుతలం చేశాయి. సుమారు 4 వేల ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. సుమారు 13.48 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వన్యప్రాణులూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు 130 అటవీ జంతువులు ప్రాణాలు కోల్పోగా.. 25 లక్షల వన్య ప్రాణులపై వరదలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. మనాస్ నేషనల్పార్క్, పొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. ఖడ్గమృగాలు, ఏనుగులు, జింకలు సహా వన్యప్రాణులను కృత్రిమంగా ఏర్పాటుచేసిన ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని నిర్ణయించారు. లేదా కార్బి అంగ్లాంగ్ కొండలవైపు మళ్లించాలని అధికారులు భావిస్తున్నారు.
పడకపై పులి విశ్రాంతి..
కాజీరంగా జాతీయ వనం వరదల్లో చిక్కుకోవడం... ప్రాణరక్షణ కోసం ఓ పులి... పట్టణంలోని ఓ ఇంట్లోకి చొరబడి.. మంచంపై పడుకోవడం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది అక్కడి వన్యప్రాణుల దుస్థితిని తెలుపుతుంది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి.
మేఘాలయలో...
మేఘాలయ వరదల్లో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 8కి చేరింది. సుమారు 1.55 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేరళలో
కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో సుమారు 20 సెం.మీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని 3 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్, సిక్కింల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇదీ చూడండి: కర్నాటకీయంలో ఆఖరి అంకం నేడేనా!