సర్వ శిక్షా అభియాన్... అక్షర భారతావని నిర్మాణమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకం. కార్యక్రమం ప్రారంభించి 20 ఏళ్లయింది. ఈ 2 దశాబ్దాల్లో ఎన్నో మార్పులు. పథకం మొదలైనప్పుడు 20శాతం మంది చిన్నారులు మాత్రమే బడికి వెళ్లేవారు. ఇప్పుడు అది 99శాతానికి పెరిగింది. ఇది సంతోషించదగ్గ పరిణామమే. కానీ... సర్వ శిక్షా అభియాన్ నిర్దేశిత లక్ష్యాలను మాత్రం మనం పూర్తిస్థాయిలో సాధించలేదన్నది వాస్తవం.
పునాదులు బలంగా ఉంటేనే భవిష్యత్ బాగుంటుంది. విద్య విషయంలో ఇది మరింత కీలకం. కానీ... ప్రాథమిక విద్యా పరిజ్ఞానం అలవర్చుకోలేని వారు.. తర్వాత నేర్చుకోవడం కష్టమే. అలాంటి వారు పుంజుకోలేక, ఏదో ఒక దశలో విద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంపై దృష్టిపెట్టింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 30 ఏళ్ల తర్వాత జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) నవీకరిస్తూ ముసాయిదా విడుదల చేసింది. ప్రస్తుత సంక్షోభానికి.. ప్రాథమిక విద్యను సరిగా అలవర్చుకోలేకపోవడమే కారణమని నివేదించింది.
''2025 కల్లా వయోజన ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికే అధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రాథమిక దశలోనే చదవడం, రాయడం అలవర్చుకోకపోతే.. విద్యార్థుల కోసం మేం రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలన్నీ నిరుపయోగమే. ''
- జాతీయ విద్యా విధానం ముసాయిదా
జాతీయ విద్యా విధానం ముసాయిదాకు అనుగుణంగా కేంద్రం సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించాలి. దీనిని అన్ని రాష్ట్రాలతో పంచుకొని.. సొంత కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే స్వేచ్ఛనివ్వాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ముసాయిదాను త్వరగా ఆమోదించడం మరింత ఉత్తమం.
రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలి...
సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలో ఆయా రాష్ట్రాలకు నిర్దేశిత కాలపరిమితి విధించి వాటికి స్వతంత్రంగా వ్యవహరించేందుకు సహకరించాలి. ఎప్పటికప్పుడు నిధులు అందించడం ఎంతో అవసరం.
ఇందులో భాగంగా.. 3వ తరగతికి చేరుకునే సరికి ప్రతి చిన్నారికీ చదవడం వచ్చుండాలి. ఎందుకంటే జీవితాంతం నేర్చుకోవాలనుకోవడానికి బలమైన పునాది పడాలి. అప్పుడే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. 3వ తరగతి కల్లా పిల్లలకు చదవగలిగేలా, చదువుతున్న అంశంపై అవగాహన ఏర్పడేలా తల్లిదండ్రులు, సంరక్షకులు తీర్చిదిద్దాలని కోరుతోంది సెంట్రల్ స్వ్కేర్ ఫౌండేషన్. ఇందుకోసం 'శిక్షా కీ ఏబీసీ' పేరిట ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది.
సరికొత్తగా ఆలోచించాలి...
ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అలవర్చడంలో భాగంగా.. విద్యావేత్తలు, మేధావుల నుంచి సరికొత్త బోధనా పద్ధతులను సేకరించాలి. క్షేత్రస్థాయిల్లో వీటి ఫలితాల్ని అంచనా వేయడానికి స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విధానాల అమరిక, లక్ష్యాలు, బడ్జెట్‌పై క్రమం తప్పకుండా సమీక్షించాలి.
ప్రాథమిక విద్యా నైపుణ్యాలు లేకపోవడం ఆర్థికంగా వెనుకబడినవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వారు నాణ్యమైన విద్యను అందుకోలేరు. కనీస మౌలిక సదుపాయాల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనే 65 శాతం మంది భారతీయులు ఉండటం.. లక్ష్యాలను నీరు గారుస్తోంది.
దేశవ్యాప్తంగా బోధనా పద్ధతుల్లోనే మార్పు రావాల్సిన అవసరముంది. విద్యను మెరుగుపర్చడంలో భాగంగా.. ఇప్పటికీ ఉపాధ్యాయులు, నిర్వాహకులు సహా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించకపోవడం దురదృష్టకరం. వారి పనితీరును అంచనా వేసే వ్యవస్థ లేకపోవడమూ దీనిని స్పష్టం చేస్తోంది.
విద్యా విధానం మారాలి...
నాణ్యమైన విద్యను అందించగల మన సామర్థ్యం బలహీనంగా ఉంది. ఇంకా ఏకకాలంలో బహుళ విషయాలపై దృష్టి పెట్టేలా వనరులు లేవు. ఇవే అసలైన సవాళ్లు విసురుతున్నాయి.
ఇంకా ముఖ్యంగా మన పాఠ్య ప్రణాళిక.. విద్యార్థి సామర్థ్యాలకు తగినట్లు లేదు. విద్యార్థులకు ఇది తెలుసుకోవాలనే ఆసక్తిని రగిల్చేలా, సమస్యల నుంచి గట్టెక్కించేలా విద్యా విధానాలు రూపొందించడంపై ఆలోచించాలి.
2025 నాటికి 3 నుంచి ఆరేళ్ల వయస్సున్న చిన్నారుల్లో నాణ్యమైన ప్రాథమిక విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎన్ఈపీ. రాష్ట్రాలు, జిల్లాలకు సరిపోయే సంపూర్ణ తరగతి గది సూచనల ప్యాకేజీ, విద్యార్థులు, అధ్యాపకులకు ఉపయోగపడే బోధనా విధానాల అమలుపై దృష్టి సారించే ప్రణాళిక ఈ లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడతాయి.
ప్రపంచ దేశాల్లో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి.. ప్రాథమిక విద్యలో మెరుగుదల ఎంతో కీలకం. ప్రాథమిక దశలో విద్యా పరిజ్ఞానం.. మంచి ఆదాయం, ఆరోగ్యం, భద్రతకు అవకాశాలను పెంచుతుందని ఎన్ఈపీ నమ్ముతోంది. చిన్నారుల భవితతో పాటు, దేశ భవిష్యత్తు కోసం భారత్ చేసే ఉత్తమ పెట్టుబడి ఇదే.
53 శాతం అల్ప, మధ్య స్థాయి ఆదాయ వర్గాల చిన్నారులు.. విద్యాపరమైన పేదరికంతో ఇబ్బంది పడుతున్నారని తాజాగా ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. పదేళ్లు వచ్చే సరికి కనీసం సాధారణ పదాలను కూడా చదవలేకపోతున్న వాస్తవాన్ని కళ్లకుకట్టింది. ఈ దశాబ్దంలోగా విద్యాపేదరికాన్ని సగానికి తగ్గించాలని ప్రపంచబ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి జాతీయ విద్యా విధానం సరైన మార్గనిర్దేశనం చేస్తుందని ఆశిద్దాం.
- (ఆశిష్ ధావన్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ఛైర్మన్)