మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాల్ని ప్రకటిస్తూ ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ పనిగంటల్లో మాత్రం మరో 45నిమిషాలను అదనంగా చేర్చింది. ఈనెల 29 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ కొత్త విధానంతో ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా.. ఇంధనం, విద్యుత్ ఖర్చులను కూడా తగ్గించొచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.
కొన్నేళ్లుగా 5 రోజుల పనిదినాలను కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక మేరకే.. ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేబినెట్ సమావేశంలో ప్రకటించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఫలితంగా 20 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇకపై ప్రతి శనివారం సెలవే...
ప్రభుత్వ ఉద్యోగులు రోజుకు మధ్యాహ్న భోజన విరామాన్ని కలుపుకొని 7గంటల 45నిమిషాల పాటు పనిచేస్తున్నారు. దీనికి మరో 45 నిమిషాలు అదనంగా చేర్చడం వల్ల 8గంటల 30నిమిషాలు కానుంది. ఇందులో మధ్యాహ్న భోజన విరామం గరిష్ఠంగా 30 నిమిషాలుగా నిర్ణయించారు.
వీటికి మినహాయింపు...
రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకు ఇదే పని విధానాలు వర్తిస్తాయని తెలిపిన ప్రభుత్వం.. పోలీసులు, అగ్నిమాపక దళం వంటి అత్యవసర సేవలు; ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపునిచ్చింది.
ఇప్పటికే ఈ విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు... రాజస్థాన్, బిహార్, పంజాబ్, దిల్లీ, తమిళనాడు, పశ్చిమ్‌బంగ రాష్ట్రాలలో అమల్లో ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి