ప్రధాని నరేంద్రమోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది కాంగ్రెస్. సాయుధ దళాలను పదేపదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ మోదీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఇందుకు ప్రధాని ప్రచారంపై కొంతకాలం నిషేధం విధించాలని పేర్కొన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, జైరాం రమేశ్, అభిషేక్ మను సింఘ్వీలు ఈసీని సంప్రదించిన వారిలో ఉన్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పైనా ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. ఏప్రిల్ 18న బెంగళూరులో నిర్మలా ఓటేసిన అనంతరం.. 'అబ్కీ బార్ ఫిర్ మోదీ సర్కార్' అంటూ భాజపా నినాదాన్ని పోలింగ్ బూత్ వద్ద ప్రస్తావించారని సంబంధిత వీడియోను ఈసీకి అందజేశారు. ఇది కూడా ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు.
మరికొందరిపై...
భోపాల్ భాజపా అభ్యర్థిగా పార్టీ ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోన్న సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకుర్పై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. భోపాల్ ఎన్నికల సంఘం ఆదేశాలతో అక్కడి పోలీసులు చర్య తీసుకున్నారు.
1992 బాబ్రీ ఘటనలో భాగం కావడం తనకు గర్వకారణమన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించింది ఈసీ. టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఇంతకుముందే సంజాయిషీ నోటీసులు జారీ చేసింది ఈసీ.
రాంపుర్ భాజపా నేత, సినీ నటి జయప్రదపైనా ఫిర్యాదు నమోదైంది. అక్కడి ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.