ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఐక్యతా విగ్రహానికి సరికొత్త కళను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది గుజరాత్‌కు చెందిన ఓ బృందం. ఇనుముతో తయారు చేసిన అనేక రకాల జెముడు జాతి మొక్కలతో ఐక్యతా విగ్రహం చుట్టూ అలంకరించేందుకు సిద్ధమైంది వడోదరలోని మహారాజాసయాజీరావు యూనివర్సిటీ బృందం. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీల పెయింటింగ్లనూ ఇనుప జెముడు తోటలో ఏర్పాటు చేయనున్నారు.
పర్యటకులను ఆకర్షించేందుకు విభిన్న కళాఖండాలను సృష్టిస్తోందీ బృందం. రంగు రంగుల ఇనుపనాగ జెముడు, బ్రహ్మ జెముడు వంటి మొక్కలను తయారు చేస్తున్నారు. ఈ ఇనుప కాక్టస్(జెముడు) మొక్కల తయారీలో హాని రహిత రంగులను ఉపయోగిస్తున్నారు. సుమారు నాలుగు అడుగుల నుంచి పదహారు అడుగుల వరకు ఉండే కాక్టీని అధ్యాపకులు రూపొందించారు.
" సర్దార్ వల్లభాయ్ స్మారక చిహ్నం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక కాక్టస్ గార్డెన్(జెముడు తోట) తయారు చేస్తున్నాం. దీని కోసం మేము వివిధ రకాల ఇనుప కాక్టీలను డిజైన్ చేస్తున్నాము. కళాకృతులను చిత్రీకరించడానికి ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. మేము ఈ కాక్టీలను సుమారు 8,000 చదరపు అడుగుల గోడపై ఉంచుతాము."
- జయంతి ఎల్ రబాడియా, ఫైన్ ఆర్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్
ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా పేరుగాంచి.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకర్థంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని నిర్మించింది. అంతటి మహోన్నతమైన ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఫైన్ ఆర్ట్ విభాగం అధ్యాపక బృందం ఇలా వినూత్న ప్రయత్నం చేస్తోంది.