హరియాణా కైతల్లో ఓ కాకి... బల్కార్ సింహ అనే వ్యక్తిపై పగబట్టింది. వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా... అతడి పరిస్థితి చూస్తే మాత్రం ఔననే అనిపిస్తోంది. రాజమౌళి సినిమాలో ఓ చిన్న ఈగ శత్రువును ముప్పతిప్పలు పెట్టగా.. నేనెందుకు చేయలేను అనుకుందో ఏమో ఈ దుకాణదారుడిని వెంటపడి మరీ వేధిస్తోంది.
కొన్ని రోజుల క్రితం గాయపడిన ఓ కాకి పిల్లకు బల్కార్ చికిత్స చేసి, కాపాడాడు. కానీ ఆ కాకి తల్లికి ఆ వ్యక్తి కాపాడాడని తెలీదు. మరుసటి రోజు నుంచి అతడిని అనుసరించసాగింది. అప్పుడప్పుడు తలపై కోపంగా మొట్టికాయలు కూడా వేస్తోంది.
"ఓ రోజు ఆ కాకి పిల్ల నా దుకాణంలో పడిపోయింది. నేను దానికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడాను. అప్పటి నుంచి ఈ కాకి నా వెంటపడుతోంది. నేనెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తోంది. ఈ కాకి నన్ను ఇబ్బంది పెడుతోంది. ఎప్పుడుపడితే అప్పుడు నా తలపై మొట్టుతోంది."
-బల్కార్, కైతల్ వాసి