గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన కిన్నరిబా జడేజా పెళ్లికుమార్తె అలంకరణలో వెలిగిపోయింది. ఎడ్లబండిని చూసి ఆనందంలో మునిగి తేలింది. ఎందుకంటే ఆ ఎడ్లబండి నిండా కిన్నరిబాకు ఎంతో ప్రియమైన నిధి నిండి ఉంది.
తండ్రి హర్దేవ్ సింహ్ జడేజా తనకు పెళ్లికానుకగా ఇచ్చిన పుస్తక నిధి చుసి వజ్రవైడూర్యాలు దొరికినట్లు మురిసిపోయింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 2 వేల రెండు వందలకు పైగా పుస్తకాలు బహుమానంగా స్వీకరించి సంతోషం వ్యక్తం చేసింది.
"నేను ఓ రాజ్‌పుత్ యువతిని. ధైర్యవంతమైన రాజపుత్రికల చేతిలో శస్త్రాలతో పాటు.. శాస్త్రాలు కూడా ఉండాలి. ఈ తరానికి అస్త్రశస్త్రాల కంటే.. కలం అవసరం ఎక్కువగా ఉంది. కలాన్ని ప్రచారం చేయడానికి.. దానిని మరింత ముందుకు నడపడానికే నా పెళ్లి కానుకగా పుస్తకాలు కొనివ్వమని మా నాన్నను కోరాను. నాన్న నా కోరిక తీర్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను."
-కిన్నరిబా జడేజా, పెళ్లి కుమార్తె
బాల్యం నుంచే పుస్తకాలతో చెలిమి చేసిన కిన్నరిబా.. పుస్తకాల గొప్పతనాన్ని తన పెళ్లి వేదికపై తెలియజేయాలనుకుంది. అందుకే, కట్నకానుకులకు బదులు తన వివాహ వేడుకలో పుస్తకాలు కావాలని తండ్రిని కోరింది.
"కుమార్తెల వివాహంలో సాధారణంగా తండ్రులు తమ స్తోమతకు తగ్గట్టు బంగారం, వెండి, వాహనాలు, బంగ్లాలు కానుకగా ఇస్తారు. నేను ఓ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని. నా మనసులో కాస్త వినూత్న ఆలోచన ఉండేది. నా కుమార్తె బాల్యం నుంచి తను దాచుకున్న డబ్బుతో సుమారు 500లకు పైగా పుస్తకాలు సేకరించింది. ఆ పుస్తక ప్రేమతోనే .. ఓ వేదికపై మాట్లాడుతూ.. నాన్న నా పెళ్లిలో బంగారం ఇవ్వకపోయినా, నా బరువుకు సమానమైన పుస్తకాలు నాకు కానుకగా ఇవ్వమని అడిగింది. "
-హర్దేవ్ సింహ్ జడేజా, పెళ్లి కుమార్తె తండ్రి