చేతికొచ్చిన పంటని క్షణాల్లో నాశనం చేయగల పాకిస్థాన్ రాకాసి మిడతల దండు మధ్యప్రదేశ్ సరిహద్దు మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. శనివారం సాయంత్రం కోరియా జిల్లా భరత్‌పుర్ తహసీల్దార్ పరిధిలోని ధోర్ధరా గ్రమాం జవారీటోలాలో భారీ సంఖ్యలో మిడతలను చూసి ఆందోళన చెందారు స్థానికులు. మిడతల దండును చూసిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు. పంటలను కోల్పోతామని భయాందోళన చెందుతున్నారు.
ప్రత్యేక కంట్రోల్ రూం..
మిడతలు, ఇతర సమస్యల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది ఛత్తీస్‌గఢ్ సర్కార్. కోరియా జిల్లా అధికార యంత్రాగం మొత్తం ఇప్పుడు జవారీటోలాపైనే ప్రత్యేక దృష్టి సారించింది. మిడతల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోంది.
ఎక్కడివీ రాకాసి మిడతలు..?
రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మిడతల జాతి భారత్‌కు చెందింది కాదు. వీటిని కట్టడి చేసేందుకు సరైన పరిష్కారాలు లేవు. రసాయనాల స్ప్రే, పొగ ద్వాారా కొంత వరకు నియంత్రించవచ్చు. ఈ మిడతలు మూడుసార్లు 80 చొప్పున గుడ్లు పెడతాయి. తద్వారా వాటి సంఖ్యను అమాంతం పెంచుకుంటుపోతాయి. వాటి గుడ్లను నాశనం చేయగలిగితే కొంతవరకు నియంత్రించవచ్చు.
మిడతలను నాశనం చేసేందుకు పొగబెట్టడం, తాళాలతో ధ్వనులు చేయడం వంటి పాత పద్ధతులను పాటించాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. స్ప్రే చేసినప్పటికీ మిడతలు పూర్తిగా నశించడం లేదని, 30 నుంచి 40 శాతం మాత్రమే చనిపోతున్నాయని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: కొబ్బరిబోండాలు దొంగతనం చేశాడని.. నరికేశారు!