కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం దిగిరాకుంటే మే 2024(వచ్చే లోక్‌సభ ఎన్నికల) వరకైనా ఉద్యమం చేపట్టేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. ముఖ్యంగా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నాగ్‌పుర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఇది కేవలం ధనిక రైతుల ఉద్యమం అని వస్తోన్న ఆరోపణలపై స్పందించిన తికాయత్.. మారుమూల గ్రామాల ప్రజలూ తమ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నట్లు పేర్కొన్నారు.
ట్రాక్టర్ల ర్యాలీ ఆరోజే
తాము ముందుగా వెల్లడించిన ప్రకారమే గణతంత్ర దినోత్సవం రోజు టాక్టర్ల ర్యాలీ చేయనున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. దిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు తమ వల్ల ఎలాంటి హాని కలగదని స్పష్టం చేశాయి.
దిల్లీ బాహ్యవలయ రహదారి వద్ద ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. గణతంత్ర వేడుకలకు అంతరాయం కలగకుండా శాంతియుతంగా ర్యాలీ జరుగుతుందని వెల్లడించారు. రైతులు తమ ట్రాక్టర్లపై జాతీయ జెండాను పెట్టి భారీ ర్యాలీ చేయనున్నట్లు తెలిపారు.
రైతులపై దేశద్రోహం కేసులా?
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న అన్నదాతలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేసులు పెడుతోందని రైతు సంఘం నాయకుడు దర్శన్ పాల్ సింగ్ ఆరోపించారు. ఈ చర్యను రైతులు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.