సాగు చట్టాలను నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతుల్లో బుధవారం ఓ కర్షకుడు మృతిచెందాడు. హరియాణాలోని రోహ్తక్ జిల్లా వాసి అయిన జై భగవాన్ రాణా(42) మంగళవారం సల్ఫస్ మాత్రలను తీసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అనంతరం అతడిని స్థానిక సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు.
తాను ఒక చిన్న రైతునని సూసైడ్ నోట్లో రాసుకొచ్చిన రాణా.. కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా అనేక మంది రైతులు వీధిన పడ్డారని పేర్కొన్నారు. 'ఇది కేవలం రెండు మూడు రాష్ట్రాల విషయమని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. దేశంలోని రైతులంతా చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఇది ఉద్యమం కాదు, పోరాటం. రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపుతున్నప్పటికీ ప్రతిష్ఠంభన మాత్రం వీడట్లేదు' అని లేఖలో రాశారు రాణా.
అయితే.. ఈ వ్యవహారంపై కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ) కింద చట్టపరమైన చర్యలు చేపడతామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఔటర్) ఏ. కోవాన్ తెలిపారు.
ఇదీ చదవండి: 'సాగు చట్టాల' కమిటీపై అనుమానాలు- సుప్రీం అసహనం