మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే వర్ధంతి కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ఠాక్రేకు నివాళులర్పించి తిరిగి వెళుతుండగా శివసేన కార్యకర్తలు ఎగతాళి చేస్తూ ఫడణవీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వం ఎవరిది? శివసేనది..
నేడు శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 9వ వర్ధంతి. ఈ సందర్భంగా ముంబయిలోని శివాజీ పార్క్‌లో ఆయనకు నివాళులర్పించారు ఫడణవీస్. అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌కు సమీపంలో ఉన్న కొంతమంది శివసేన కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో ఫడణవీస్ చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఎద్దేవా చేశారు. 'ఎన్నికల అనంతరం సీఎంగా తిరిగి బాధ్యతలు చేపడతా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. అన్నారు ఎవరు? ప్రభుత్వం ఎవరిది? శివసేనది' అంటూ మరాఠీలో నినాదాలు చేశారు. వాటితోపాటు 'ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు జై' అంటూ నినదించారు.
శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తున్నప్పటికీ ఫడణవీస్ సహా ఆయనతో ఉన్న భాజపా సీనియర్ నేతలు, నాయకులు స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
శివసేన అగ్రనాయకులు దూరం..
బాల్‌ఠాక్రే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ఫడణవీస్ వచ్చిన సమయంలో శివసేన నాయకులెవరూ అక్కడ లేరు. ఉద్ధవ్ ఠాక్రే పీఏ మిలింద్ నర్వేకర్ ఒక్కరే ఉన్నారు.
ఇదీ చూడండి: అబ్దుల్లా నిర్బంధంపై అఖిలపక్ష భేటీలో విపక్షాలు గరం