జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయనిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఓ వర్గం వాదిస్తుంటే.. మరో వర్గం వారు ఇది రాజకీయ లబ్ధి కోసమేనని అంటున్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే అధికరణను రద్దు చేసింది. దీనికి తోడు జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది.
కేంద్రం చట్టబద్ధ నిర్ణయమే తీసుకుంది
తాజా పరిస్థితులపై సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ న్యాయ నిపుణులు రాకేశ్ ద్వివేది స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదేనని పేర్కొన్నారాయన.
"చాలాకాలంగా మరుగున పడిన అంశమిది. ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం. ఇది స్వాగతించదగ్గదే. కశ్మీర్లో బయటి వాళ్లకు అవకాశాలిస్తున్నప్పుడు అక్కడ ఆర్టికల్ 35-ఏ అవసరమేంటో నాకర్థం కావడం లేదు.(ఆర్టికల్ 35ఏ కల్పించే హక్కులను గుర్తు చేస్తూ)"
-రాకేశ్ ద్వివేది, రాజ్యాంగ న్యాయ నిపుణులు
ఆర్టికల్ 35ఏ కశ్మీరీ స్థానికతను ధ్రువీకరిస్తుంది. దీని ద్వారానే అక్కడ నివసించే వారికి ప్రత్యేక హక్కులు లభిస్తాయి. 1954 మే14న రాజ్యాంగంలో ఈ అధికరణ చేర్చారు.
'ఆర్టికల్ 370 కారణంగా ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో చట్టాలు వర్తించేవికావు. ఇకపై అక్కడ అన్ని చట్టాలు వర్తిస్తాయి' అని మాజీ ఆటార్నీ జనరల్ సోలి సర్బోజి అన్నారు.
కనీసం విపక్షాలతో సంప్రదించలేదు
కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయం రాజకీయఅంశంతో కూడుకున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ అన్నారు.
"కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏదో జరగబోతుందనే విషయం అందరికీ అర్థమైంది. అయితే విపక్షాలతో కేంద్రం సంప్రదింపులు జరపకుండా ఇలాంటి ప్రతిపాదనను తీసుకురావడం సరైందికాదు."
- అశ్వనీ కుమార్, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి
ఇదీ చూడండి: '370 రద్దు ఉగ్రవాద విషవృక్షం అంతానికే'