దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వైద్య సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కరోనాపై పోరులో భాగంగా 15 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కరోనా బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని.. అప్పుడే వారిని ట్రేస్ చేసి, ఐసోలేట్ చేయగలుగుతామని స్పష్టం చేశారు.
మూడు నెలల క్రితం దేశంలో పీపీఈ కిట్లు, డయాగ్నోస్టిక్ కిట్ల కొరత ఉండేదని తెలిపారు మోదీ. అయితే ఇప్పుడు కోటికిపైగా పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులను రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు.
దేశంలో యాక్టివ్ కేసుల కన్నా రికవరీ అయిన బాధితుల సంఖ్యే ఎక్కువగా ఉందని ప్రధాని వెల్లడించారు. సకాలంలో స్పందించి.. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే కరోనాను నియంత్రించగలిగినట్టు పునరుద్ఘాటించారు.
ఇదీ చూడండి:- దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు వీరే