మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భాజపా విజయకేతనం ఎగురవేస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అనంతరం విడులైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ.. రెండు రాష్ట్రాల్లో మళ్లీ కమలమే వికసిస్తుందని తేల్చి చెప్పాయి. భాజపా దూకుడు ముందు ప్రతిపక్ష పార్టీలు చతికిలపడడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేశాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో... పోటీ పడిన 3వేల 237 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు... పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు.
భాజపాకు తిరుగులేని మెజారిటీ
మహారాష్ట్రలో భాజపా-శివసేన కూటమి తిరుగులేని మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. 288 స్థానాలకు గానూ.. 200కిపైగా స్థానాల్లో గెలుపొంది మరోసారి అధికారపీఠాన్ని చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చి చెప్పాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అధికారంలోకి రావాలంటే 145 సీట్లు రావాల్సి ఉంది. భాజపా- శివసేన రెండోసారి విజయదుందుభి మోగించనుందన్న ఇండియాటుడే సంస్థ.. గతంలో కంటే కాంగ్రెస్‌కు తక్కువ స్థానాలు వస్తాయని వెల్లడించింది. మహారాష్ట్రలో భాజపా 230, కాంగ్రెస్48, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధిస్తారని.. టెమ్స్నౌ తేల్చి చెప్పింది. రిపబ్లిక్ జన్‌కీ బాత్, సీఎన్ఎన్ న్యూస్18, ఏబీపీ న్యూ- సీ ఓటర్, న్యూస్ 24 సర్వేలన్నీ మరాఠా ప్రజలు మరోసారి భాజపాకే పట్టం కడతారని స్పష్టం చేశాయి.
సైకిల్‌పై వచ్చిన సీఎం
అటు హరియాణలోనూ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజకీయ నేతలు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ పడిన 11వందల 69 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. హరియాణా వ్యాప్తంగా 19వేల 578 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్.. సైకిల్ తొక్కుతూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జన్ నాయక్ జనశక్తి అధినేత దుష్యంత్ చౌతాలా తన కుటుంబంతో సహా ట్రాక్టర్‌పై వచ్చి ఓటు వేశారు. కాంగ్రెస్ హరియాణా అధ్యక్షురాలు కుమారి సెల్జా... హిస్సార్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు..
హరియాణాలోనూ కమలమే
హరియాణాలోనూ మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. 90 స్థానాలున్న హరియాణాలో టైమ్స్ నౌ సంస్థ.. భాజపా 71 స్థానాలు, కాంగ్రెస్ 11, ఇతరులు 8 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. రిపబ్లిక్‌టీవీ-జన్ కీ బాత్ .. భాజపాకు 52 నుంచి 63 స్థానాలు, కాంగ్రెస్‌కు 15 నుంచి 19, ఐఎన్ఎల్డీ, శిరోమణి అకాలీదళ్‌కు ఒక్కో స్థానం దక్కుతుందని తెలిపింది. భాజపా 47 స్థానాల్లో గెలుపొందుతుందని.. కాంగ్రెస్ 23 స్థానాల్లో ఇతరులు 20 చోట్ల విజయం సాధిస్తారని... టీవీ 9 భారత్ వర్ష్ సర్వే అంచనా వేసింది. ఏబీపీ న్యూస్ సర్వే.. భాజపాకు 72 స్థానాలు, కాంగ్రెస్‌కు 8, ఇతరులకు 11 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. న్యూస్18-ఐపీఓఎస్ సర్వే.... భాజపాకి 75, కాంగ్రెస్‌కు 10, ఇతరులు 5 చోట్ల గెలుస్తారని స్పష్టం చేసింది..
మహారాష్ట్ర, హరియాణ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 24న తేలనుంది.