కరోనాపై పోరాటంలో దేశంలోని రాష్ట్రాలన్నీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. వైరస్ కట్టడిలో భారత్ అనుసరించిన విధానాలు ప్రపంచానికే ఆదర్శమని డబ్ల్యూహెచ్ఓ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
దేశంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు గౌడ. ప్రజలు, నిపుణుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మరో 30 ఎరువులపై నిషేధం విధించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. కరోనా నియంత్రణ సహా పలు కీలకాంశాలపై 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
"లాక్డౌన్ సహా కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ నిర్ణయాలను అందరూ ప్రశంసిస్తున్నారు. కరోనా నియంత్రణ పట్ల భారత్ అనుసరిస్తోన్న విధానాలు ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ సైతం వ్యాఖ్యానించింది. కరోనా కట్టడికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతమయ్యాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ వంతు పాత్ర పోషించారు."
-సదానంద గౌడ, కేంద్ర మంత్రి
సరిపడా ఉన్నాయి!
దేశంలో ఎలాంటి ఔషధాల కొరత లేదని వెల్లడించారు గౌడ. ఇతర దేశాలకు సైతం భారత్ ఔషధాలను ఎగుమతి చేస్తోందన్నారు. ఈ విషయంలో అన్ని దేశాలూ భారత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల్లో అతితక్కువ ధరలకే మందులు సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేంద్రాల ద్వారా పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అందుబాటు ధరలకే ఔషధాలను కొనుగోలు చేయవచ్చన్నారు.
సేంద్రీయంపై దృష్టి
సేంద్రీయ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తోందని సదానంద గౌడ గుర్తు చేశారు. ప్రతీ రైతు సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు.
47 శాతం తగ్గిన ధరలు
ఎన్ 95 మాస్కుల ధరలను ఇప్పటివరకు 47 శాతం వరకు తగ్గించినట్లు గౌడ వెల్లడించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలను మరింత తగ్గించనున్నట్లు తెలిపారు.
భళా... కేరళ
కొవిడ్ నియంత్రణలో కేరళ అనుసరించిన విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయన్నారు గౌడ. పంచాయితీలు, ఇతర ప్రభుత్వ సంస్థలను సమర్థంగా ఉపయోగించుకొని స్థానిక వ్యాప్తిని అడ్డుకోగలిగిందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి వల్లే ఇటీవల వైరస్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసలు కురిపించారు. కరోనా కట్టడి విషయంలో కేరళ రాష్ట్రానికి సదానంద గౌడ ఇంఛార్జీ మంత్రిగా ఉన్నారు.
ఇదీ చదవండి: ''మహా' ప్రభుత్వ నిర్ణయాలతో మాకే సంబంధం లేదు'