ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు రక్షణ శాఖ మాజీ అధికారులు, మాజీ ఐఏఎస్‌ల బృందం. ఆగస్టు 5న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం, నిష్పలమైనవిగా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించే హోంశాఖ బృందంలోని మాజీ సభ్యుడు, ప్రొఫెసర్ రాధాకుమార్, మాజీ ఐఏఎస్ అధికారులు హిందాల్ హైదర్ త్యాబ్జీ, అమితాభ పాండే, గోపాల్ పిల్లాయ్, రక్షణ శాఖ అధికారులు ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) కపిల్ కాక్, మేజర్ జనరల్ (రిటైర్డ్) అశోక్ కుమార్ మెహతాలు పిటిషన్ దాఖలు చేశారు.
"370 రద్దు అసాధారణ రాజ్యాంగ విరుద్ధ చర్య. ఆర్టికల్ 367 సవరణల ద్వారా, అధికరణ 370(3)నియమాన్ని ఉపయోగించి ఆర్టికల్ 370, జమ్ముకశ్మీర్ రాజ్యాంగాన్ని రద్దు చేశారు. రాష్ట్రాన్ని విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. అందులోని కొంత భాగం లద్దాఖ్‌ను మరో కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజలకు ఎలాంటి సమాచారం తెలియకుండా పూర్తి చేశారు. పై చర్య రాష్ట్రాన్ని అపాయంలోకి నెట్టింది. "
- పిటిషన్.
రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి మాత్రమే ఆర్టికల్ 370 రద్దు అమలులోకి వస్తుందన్నారు పిటిషనర్లు. కానీ రాష్ట్ర అసెంబ్లీ సిఫార్సు చేయనంత వరకు ఆర్టికల్ 370 (3)లోని నియమాల ద్వారా ఆర్టికల్ 370 రద్దు జరగదని పేర్కొన్నారు.
అర డజన్‌కు పైగా...
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అర డజన్‌కుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, అధికరణ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని విజ్ఞప్తి చేశారు పిటిషనర్లు.
ఇదీ చూడండి: 'పాక్‌తో చర్చలంటూ జరిగితే 'పీఓకే'పై మాత్రమే'