సంకల్పం ఉంటే ఆశయ సాధనకు వైకల్యం అడ్డుకాదని నిరూపించాడు గుజరాత్ వల్సాడ్ జిల్లాకు చెందిన జగదీశ్ సోమభాయ్. దివ్యాంగుడైనా క్రికెట్ మీద ఉన్న అమితాక్తిని వీడలేదు అతడు. ఎడమచేతితోనే అద్భుతంగా ఆడుతున్నాడు. సాధారణ క్రికెటర్లు కూడా అతని ఆటతీరు చూసి అసూయపడే ప్రతిభ కనబరుస్తున్నాడు. అయితే జగదీశ్‌కు సరైన ప్రోత్సాహం లభించనందు వల్ల గ్రామస్థాయికే పరిమితమయ్యాడు. అధికారులు చొరవ తీసుకుని తనకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో అవకాశం కల్పించాలని ప్రాధేయపడుతున్నాడు.
విషాధాన్ని అధిగమించి..
జగదీశ్ ఐదో తరగతి చదువుతున్నప్పడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుడిచేయి తీవ్రంగా దెబ్బతిన్నది. తన తల్లిదండ్రులు సరైన వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లలేదు. కొన్నాళ్ల తర్వాత గాయం మరింత తీవ్రమై చేయి ఎత్తలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎముకల వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు జగదీశ్ తల్లిదండ్రులు. సమయం దాటిపోయిందని, తప్పనిసరి పరిస్థితుల్లో అతని కుడి చేయిని తొలగించారు వైద్యులు.
చేయి లేకపోయినా క్రికెట్‌పై ఉన్న ప్రేమతో పట్టువీడలేదు జగదీశ్. ఒంటి చేతితోనే క్రికెట్ ఆడటం సాధన చేసి రాటు దేలాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో అదరగొడుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పుడు గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తాచాటాలని తపనతో ఉన్నాడు. సరైన గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇదీ చూడండి: 25 వేల సబ్బులతో కరోనాపై అవగాహన కల్పిస్తోన్న విద్యార్థులు