సుమారు రెండు దశాబ్దాల క్రితం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. విభజనతో ఛత్తీస్‌గఢ్ ప్రాంత ప్రజలు సమస్యలను అధిగమిస్తారని అంతా భావించారు. అయితే ఇక్కడి పూర్వాంచల్ ప్రాంత ప్రజల జీవనశైలి మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ ఇక్కడి గిరిజన ప్రజలు రేకు, టార్పాలిన్ల సాయంతో అడవుల్లో నివసిస్తున్నారు.
అయితే ఈటీవీ భారత్ చొరవతో కొరియా జిల్లాలోని రామ్‌చరణ్ కుటుంబానికి ఆవాసం లభించింది. ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన ప్రభుత్వం భూమిని ఇచ్చి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. తనకు సాయం చేసిన ఈటీవీ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపాడు రామ్ చరణ్.
"అడవిలో నివసిస్తున్న నాకు గ్రామంలో ఆవాసం కల్పిస్తున్నారు. నా సమస్యను అధికారుల వరకు తీసుకెళ్లినందుకే నాకు ఈ ఉపకారం జరిగింది. అందుకే మీకు (ఈటీవీ భారత్‌కు) మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను." -రామ్‌చరణ్
సల్గావకాలలో నివసిస్తున్నారు రామ్‌చరణ్. కుటుంబానికి సంబంధించిన భూమి వివాదంలో ఉంది. ఈ కారణంగా మూడేళ్లుగా అడవిలోనే జీవనం సాగిస్తున్నాడు రామ్‌చరణ్. ఈ విషయాన్ని ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ కథనానికి స్పందించిన భరత్‌పుర్ ఎమ్మెల్యే గులాబ్ కమ్రో.. ప్రభుత్వం నుంచి రామ్‌చరణ్‌కు భూమిని కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.