మన దేశ రైతులు కరోనా మహమ్మారిపై యోధులు మాదిరిగా పోరాడుతున్నారని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కొనియాడారు. పరిస్థితులు ఎలా ఉన్నా వ్యవసాయ సంబంధిత పనుల్లో కర్షకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆహారోత్పత్తికి పాటు పడుతున్నారని 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో ఆయన చెప్పారు.
![Union Minister Narendra Singh Tomar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7230017_narendra-singh-tomar.jpg)
కర్షకులకే తొలి ప్రాధాన్యం..
'పేదలు, రైతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తారు. ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలనూ ఇది కనిపించింది. ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదనే మొదటి దశ లాక్‌డౌన్‌లో పేదల సంక్షేమానికి ప్యాకేజీ ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులున్నా విత్తనాలు నాటి పంటల్ని వేసేందుకు రైతులు యోధుల్లా పనిచేస్తున్నారు. వేసవి పంటల విస్తీర్ణం 45% పెరగడమే దీనికి నిదర్శనం. కనీస మద్దతు ధరకు పంటల్ని కొనడం, వివిధ పథకాల అమలు ద్వారా రూ.లక్ష కోట్లను రైతుల జేబుల్లోకి చేరవేయగలిగాం. వ్యవసాయ రంగంలో 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన అంశాలనూ నరేంద్రమోదీ సర్కారు ఇప్పుడు సరిదిద్దుతోంది. మార్కెట్ చట్టాన్ని కేంద్ర చట్టంగా మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. పంటల కొనుగోలుకు సరిపడా నిధులు నాఫెడ్, ఎఫ్‌సీఐల వద్ద ఉన్నాయి. రాష్ట్రాల నుంచి నివేదికలు అందిన 48 గంటల్లోగానే చెల్లింపులు చేస్తున్నాం. ఏ రాష్ట్రం నుంచి అసంతృప్తి వ్యక్తం కాలేదు' అని తోమర్ వివరించారు.
ఉత్పత్తులకు అంతర్రాష్ట్ర వాణిజ్యం
వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్రాష్ట్ర వాణిజ్యాన్ని మెరుగుపరచాలని ప్యాకేజిలో చేర్చామని, ఈ మేరకు ఒక నమూనాను నీతిఆయోగ్ ద్వారా రాష్ట్రాలకు పంపించామని తోమర్ తెలిపారు. ఎలాంటి అవరోధాలు, పన్నులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని ప్రోత్సహించేలా రాష్ట్రాలకు సూచనలు ఇచ్చామని, పంటల్ని ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించనున్నామని చెప్పారు. 'ఆహార ధాన్యాలు, పాడి పరిశ్రమ పరంగా మన అవసరాలకు మించిన ఉత్పత్తులు వస్తున్నాయి. నిల్వలు పుష్కలం. ఖరీఫ్‌లోనూ దిగుబడులు బాగుంటాయి. ఇతర దేశాలకు ఎగుమతి చేయగల స్థితిలో ఉన్నాం. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కుంటున్నాం' అని చెప్పారు.
ఇదీ చూడండి: మూసధోరణి వద్దు.. ఏదీ సమగ్ర విధాన సేద్యం?