"ఆంగ్లంలో రెండు డిగ్రీలు -ప్రస్తుతం యాచకురాలు"అంటూ 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి భారీ స్పందన లభించింది. ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు చెందిన హన్సీ ప్రహారిని ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం సహా పలు సేవా సంస్థలు ముందుకొచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం హామీ..
ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే హన్సీని ఆదుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆమె వివరాలు సేకరించాల్సిందిగా స్థానిక కలెక్టర్‌కు సూచించింది. తరువాత హరిద్వార్ కలెక్టర్ సైతం ఆమెను కలిశారు.
హన్సీని, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామని కేబినెట్ మంత్రి మదన్ కౌషిక్ తెలిపారు. హన్సీ ఆరోగ్యానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
"కుంభమేళా ఉత్సవం కంటే ముందే హరిద్వార్‌లో ఉన్న యాచకులను గుర్తించి వారికి కేటాయించిన వసతి గృహంలో ఉంచుతాం."
--మదన్ కౌషిక్, కేబినెట్ మంత్రి
హన్సీకి అండగా ఉంటామని ఉత్తరాఖండ్ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్ తెలిపారు.
"ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థిని ఈరోజు హరిద్వార్ వీధుల్లో యాచకురాలిగా జీవనం సాగిస్తోంది. ఇది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అండగా ఉండాలి "
-- ఇందిరా హృదయేష్ ,ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేత
రాజ్యసభ ఎంపీ ప్రదీప్ టమ్టా ఈ కథనంపై 'ఈటీవీ భారత్'తో స్పందించారు.
"నేను అనేక సేవా సంస్థలతో మాట్లాడాను. హన్సీకి కచ్చితంగా సహాయం అందుతుంది. డిగ్రీలు ఉన్నా యాచకురాలిగా మారటం బాధాకరం. ఆమెకు సహాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాం."
--ఈటీవీ భారత్‌తో రాజ్యసభ ఎంపీ ప్రదీప్ టమ్టా.
పరమార్థ నికేతన్ అండ..
పరమార్థ నికేతన్ ఆశ్రమం పీఠాధిపతి స్వామి చిదానంద సరస్వతి సైతం ఈ కథనంపై స్పందించారు. హన్సీకి ఆశ్రమంలో చోటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఈటీవీ భారత్‌లో కథనం చూసిన తరువాత నాకు బాధ కలిగిందని ఉత్తరాఖండ్ మహిళా శిశు సమృద్ధి శాఖ మంత్రి రేఖ ఆర్యా అన్నారు.
"హన్సీ కథనం చదివిన తరువాత నేను కొంతమందిని ఆమెకు సహాయం చేయటానికి పంపించాను. వారు ఆమెకు ఉపాధిని కల్పిస్తారు. దీంతో ఆమె సంతోషంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి "
--హరీష్ రావత్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి
హన్సీ స్నేహితులు సైతం..
హన్సీకి సాయం చేయడానికి ఆమె స్నేహితులు సైతం కదిలి వచ్చారు. కుమోన్ విశ్వవిద్యాలయం స్నేహితులు ఆమెతో ఫోన్లో సంభాషించారు. దేహ్రాడూన్ డిప్యూటీ కమిషనర్ భువన్ పాండే సైతం హన్సీతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
హన్సీ ప్రహారి నేపథ్యం..
ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు చెందిన హన్సీ ప్రహారి, కుమావూ విశ్వవిద్యాలయంలో రెండుసార్లు ఆంగ్లంలో పట్టభద్రురాలు అయ్యారు. అక్కడే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. ఆమె గతంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్ టమ్టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు.
వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాల కారణంగా తీవ్ర విషాదంలో మునిగిపోయారు హన్సీ. ప్రస్తుతం హరిద్వార్‌లోని రైల్వే స్టేషన్, బస్టాండు, గంగా తీరంలోని ఘాట్లలో భిక్షమెత్తుకుంటున్నారు. ఆమెకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి :ఆంగ్లంలో రెండు డిగ్రీలు- ప్రస్తుతం యాచకురాలు!