బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహాకూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) చీఫ్, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహ. ఎన్నికలు, మహాకూటమి నితీశ్ కుమార్ పాలనపై తనదైన శైలిలో టీవీ భారత్‌తో పంచుకున్నారు.
ఆర్జేడీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ), వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కూటమి నుంచి మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా (సెక్యులర్) ఇటీవలే వైదొలిగింది. ప్రస్తుతం భాజపా, జేడీయూ, ఎల్జేపీ ఉన్న ఎన్డీయే కూటమిలో అధికారంలో ఉంది. నవంబర్ 29తో బిహార్ శాసనసభ గడువు ముగియనుంది. అక్టోబర్ చివర్లో గానీ నవంబర్‌లో గానీ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ప్రశ్న: మహాకూటమి సీఎం అభ్యర్థి ఎవరు? తేజస్వీని ఆర్జేడీ ప్రతిపాదిస్తోంది. ఆయన అయితే మీరు అంగీకరిస్తారా?
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై కూటమి పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎవరనేది నిర్ణయించలేదు. ఈ విషయంపై నేను ఇది వరకే చాలాసార్లు చెప్పా. ఎన్డీఏ, నితీశ్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రస్తుతం మా కూటమి ముందున్న లక్ష్యం. రాష్ట్రంలో మహాకూటమిని అధికారంలోకి తీసుకొస్తాం. పదవుల కోసం కాకుండా ప్రజల ప్రాధాన్యత కోసమే నేను పనిచేస్తున్నా. అందుకే రాజ్య సభను విడిచిపెట్టా. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశా.
ప్రశ్న: ఎన్నికల కోసం మహాకూటమి సన్నద్ధత ఎలా ఉంది..?
ఎన్నికల హడావుడి మొదలైంది. మహాకూటమిలో అన్ని పార్టీలు ఎన్నికల కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి. నితీశ్ ప్రభుత్వం బిహార్‌ను నాశనం చేసింది. కరోనా మహమ్మారి అతడి వైఫల్యాలను బయటపెట్టింది. అందుకే నితీశ్ ప్రభుత్వాన్ని ఓడించి.. మహాకుటమికి ఈసారి అవకాశం ఇవ్వాలని మా కంటే ప్రజలే ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు.
ప్రశ్న: ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగేటప్పుడు ఎలాంటి సమస్యలను ప్రస్తావిస్తారు..?
విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యవసాయంపై నితీశ్ పలు హామీలు ఇచ్చారు. వాటిని నిలబెట్టకోలేదని ప్రజల్లో బలంగా మా వాణి వినిపిస్తాం.
ప్రశ్న: మహాకూటమిలో ఇప్పటికీ సీట్ల పంపకం విషయంలో కచ్చితమైన అభిప్రాయం రాలేదనుకుంటా. మీకు ఎన్ని సీట్లు కేటాయిస్తారని అనుకుంటున్నారు.?
సీట్ల పంపకాల విషయం కూటమి అంతర్గత వ్యవహారం. బహిరంగ వేదికలపై దాని గురించి చర్చించం. మా కూటమి సీట్ల కోసం కాకుండా ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తున్నాం. సీట్ల పంపకాలపై గతంలో చర్చించాం. అయితే కొన్ని కారణాల వల్ల దానిపై తుది నిర్ణయం ఆలస్యమైంది. కచ్చితంగా త్వరలోనే పరిష్కారం లభిస్తుంది.
ప్రశ్న: ఆర్జేడీ నేతలు మీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే.. వారికి అవకాశం ఇవ్వట్లేదట. నిజమేనా..?
ఈ సమాచారంలో నిజం లేదు. నేను ఆర్జేడీ నేతలతో మాట్లాడటం లేదనేది తప్పుడు వార్త. ఒక్కో నియోజకవర్గం సంబంధిత అంశాల ఆధారంగా తేజస్వి, లాలూ, జగదానంద్ సింగ్‌తో సమయానుకూలంగా చర్చిస్తున్నాం. ఎప్పుడూ మేమంతా టచ్‌లోనే ఉంటాం.
ప్రశ్న: మాజీ సీఎం జీతన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా (సెక్యులర్) మీ కూటమి నుంచి వైదొలిగింది. దాని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు మీ కూటమి ఎదుర్కొంటుందా..?
మాంఝీ మహాకూటమిలోనే ఉండాల్సింది. కానీ ఎవరైనా పార్టీని వీటితే కూటమికి కాస్త నష్టమే. కానీ మేము ఆ లోటును పూడ్చుకోగలం.
ప్రశ్న: ఎన్డీఏ జోష్‌లో ఉంటే మహాకూటమిలో దూకుడు తగ్గిందని విమర్శలు వస్తున్నాయి. మీ అభిప్రాయం..?
ఎన్డీఏలోనూ చాలా లుకలుకలు ఉన్నాయి. వాళ్ల కూటమిపైనే సొంతవాళ్లే చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఎన్డీఏలో జరిగేదాని గురించి పట్టించుకోం.
ప్రశ్న: చిరాగ్ పాసవాన్ కూటమిలో చేరతానంటే చేర్చుకుంటారా..?
ఇలాంటి సమయంలో వాటిపై చర్చించడం మంచిది కాదు. తొలుత చిరాగ్ పాసవాన్ ఎందుకు నితీశ్ నుంచి విడిపోవాలనుకుంటున్నారో మేము తెలుసుకోవాలి.
ప్రశ్న: నితీశ్ కుమార్‌ను వీడి మీరు బయటకు రావడానికి కారణాలేంటి?
నితీశ్ కుమార్ ప్రవర్తన ఇప్పుడు రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. అతను ప్రజల సంక్షేమం కంటే తన పదవి కోసమే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ప్రజలు చనిపోతున్నప్పటికీ, తన కుర్చీని కాపాడుకోవాలనే అనుకుంటున్నారు తప్ప కనీసం చింత కూడా లేదు. నితీశ్ గత 15 ఏళ్లలో చాలా చెడ్డ పనులు చేశారు. అయన గురించి పూర్తిగా తెలిసన తర్వాతే నేను బయటికి వచ్చా.