భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో సమాయానుకూల నిర్ణయాలు తీసుకుంటూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న.. ఇస్రో ఛైర్మన్ కే శివన్ చంద్రయాన్‌ను జాబిల్లి కక్ష్యలోకి చేరిన సందర్భంగా ఈటీవీ-భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించడం పట్ల మీ స్పందన ఏంటి?
శివన్: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2 చేరడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కక్ష్యలోకి చేర్చే ప్రక్రియను అత్యంత కచ్చితత్త్వంతో నిర్వహించడం ద్వారా అనుకున్న కక్ష్యలోకి చేర్చగలిగాం. ప్రస్తుతం 88 డిగ్రీల వంపుతో 100 X 18000 కిలోమీటర్ల పరిధిలోని కక్ష్యలో చంద్రయాన్-2 ఉంది. చంద్రయాన్-2లో సెప్టెంబర్ 7 అత్యంత సవాలుతో కూడుకున్న రోజు. ఆ రోజు తెల్లవారుజామున ఒంటిగంటా 40 నిమిషాల సమయంలో చంద్రయాన్-2 చంద్రుడిపై కాలుమోపే ప్రక్రియ మొదవుతుంది. 15 నిమిషాల్లోనే చంద్రయాన్-2 చంద్రుడిపై దిగుతుంది. ఆ రోజు ఆ సమయం ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తున్నాం. అయితే సమర్థంగా చంద్రుడిపై చంద్రయాన్-2 దిగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఆ రోజున ఆ క్షణాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం.
ప్రశ్న: రోవర్ విషయానికి వస్తే ఏ విధమైన ఖనిజాన్వేషణ చేపడుతుంది. ?
శివన్: చంద్రుడిపై ఉన్న రసాయనాలు, ఖనిజాలు, నీటి ఆనవాళ్లు తదితరాలన్నింటిపై రోవర్ ప్రజ్ఞాన్ పరిశోధనలు చేస్తుంది. ఆ ప్రాంతమంతా కలియతిరుగుతూ విభిన్నమైన ప్రదేశాల్లో తిరుగుతూ పరిశోధనలు నిర్వహించి ఫలితాలు పంపుతుంది.
ప్రశ్న: ప్రస్తుతం చంద్రయాన్-2 పర్యవేక్షణ కోసం ఎంతమంది పనిచేస్తున్నారు. ?
శివన్: చంద్రయాన్-2 కోసం ఇస్రో మొత్తం పనిచేస్తోంది. దాదాపు 17 వేల మంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారు.
ప్రశ్న: ఇస్రో ఛైర్మన్‌గా కాకుండా ఓ భారతీయునిగా ఈ ప్రాజెక్టు పట్ల మీ ఉద్విగ్నత ఏంటి ?
శివన్: ఈ ప్రయోగం భారతీయ శాస్త్ర సాంకేతిక రంగంలో ఓ పెద్ద విజయం అవుతుంది. భారత్‌కు ఓ కొత్త సాంకేతికతను అందించగలం. అందుకేనేను భారతీయుడిగా గర్విస్తున్నాను.
ప్రశ్న: రష్యా వంటి ఇతర దేశాలకు చంద్రయాన్-2 ఇచ్చే సమాచారాన్ని పంచుకుంటారా?
శివన్: శాస్త్ర సాంకేతికత అన్నది ఇవాళ ప్రపంచం మొత్తం విస్తరించుకొని ఉంది. శాస్త్ర సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంది.కాబట్టి మనం కూడా ఇతర దేశాలతో నిర్ద్వంద్వంగా పంచుకుంటాం.
ప్రశ్న: 14 రోజుల తర్వాత చంద్రుడిపై పగలు ముగుస్తుంది. అప్పుడు రోవర్‌లో వ్యవస్థలన్నీ స్తంభించిపోతాయి. మీరు అప్పుడు ఏం చేస్తారు. ?
శివన్: మనకు 14 రోజుల తర్వాత చంద్రుడిపై పగటిపూట ముగిసి 14 రోజుల పాటు రాత్రి ఉంటుంది. ఆ చంద్రుడి రాత్రిలో కూడా వ్యవస్థల్లో ఉన్న కోడింగ్ పనిచేస్తూ ఉంటే ఆ తర్వాత చంద్రుడిపై పగలు తిరిగి వస్తుంది కాబట్టి. వ్యవస్థలు పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది.
ప్రశ్న: చంద్రయాన్-2 తర్వాత ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టులు ఏంటి?
శివన్: చంద్రయాన్-2నే మనకు గమ్యం కాదు. ఇస్రోకు ఎన్నో లక్ష్యాలున్నాయి. గ్రహాంతర ప్రయోగాలు ఉన్నాయి. మామ్ తదితర ప్రయోగాలు ఉండనే ఉన్నాయి.
ప్రశ్న: మానవ సహిత అంతరిక్ష యాత్ర పనులు ఎంతవరకు వచ్చాయి?
శివన్: మానవసహిత అంతరిక్ష యాత్ర కసరత్తులు సక్రమంగానే సాగుతున్నాయి.
ఇదీ చూడండి:'అయోధ్యలో ఆలయం స్థానంలో మసీదు నిర్మించారు'