అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న వేళ అన్నాడీఎంకేలో కొత్త ముసలం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామే అని కొందరు.. జయలలితకు విధేయుడు పన్నీర్ సెల్వమే అంటూ మరికొందరు పల్లవి అందుకోవడంతో ఈ చర్చ ఊపందుకుంది. దీంతో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల తర్వాత జరిగే పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం ఎవరనేది నిర్ణయిస్తారంటూ ఇటీవల ఆ పార్టీ నేత, సహకార మంత్రి సెల్లూరు కె. రాజు వ్యాఖ్యానించడంతో ఈ చర్చ మొదలైంది. సీఎం అభ్యర్థి పళని స్వామేనంటూ ఆ మరుసటి రోజు పాడి అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ట్వీట్ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లైంది. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం సొంత జిల్లా థేనిలో ‘2021 సీఎం ఓపీఎస్’ అంటూ పోస్టర్లు వెలిశాయి. అనంతరం వాటిని తొలగించారు.
ఈ క్రమంలో పార్టీకి పెద్దగా ఈపీఎస్-ఓపీఎస్ శనివారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కలిసి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వ్యాఖ్యానించొద్దని పార్టీ నేతలకు సూచించారు. జయలలిత మరణం తర్వాత ఈపీఎస్ ప్రభుత్వానికి, ఓపీఎస్ పార్టీకి పెద్దగా వ్యవహరిస్తున్నారు.