ETV Bharat / bharat

చైనా ముందుకు దూకితే అది 'తుగ్లక్'​ పనే అవుతుంది! - ఎల్​ఏసీ న్యూస్​

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​, చైనాలు లక్షమందికిపైగా సైనికులను మోహరించాయి. సరిహద్దు ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్నాయి. అయితే కఠోరమైన వాతావరణమే ఇరు పక్షాలకూ ఇప్పుడు అతిపెద్ద శత్రువు​. చైనా దుందుడుకుగా వ్యవహరించి, ముందుకు దూకితే ప్రకృతి చేతిలో ఓటమి తప్పదని చరిత్ర చెబుతోంది.

environment is the main enemy is  to both china and india at line of actual control
అనుభవం లేని చైనా.. ముందుకు దూకితే తుగ్లక్​ పనే అవుతుంది!
author img

By

Published : Oct 13, 2020, 9:54 AM IST

తూర్పు లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి భారత్​, చైనాలకు చెందిన లక్ష మందికిపైగా సైనికులు మోహరించారు. కఠోరమైన హిమాలయ శీతాకాలం ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. రెండు పక్షాలకూ ఇప్పుడు వాతావరణమే అతిపెద్ద శత్రువు. అయితే పర్వత ప్రాంత యుద్ధరీతుల్లో భారత బలగాలకు మంచి అనుభవం ఉంది. సియాచిన్​ వంటి ఎత్తయిన ప్రాంతాల్లో మోహరింపులు మన సేనకు అలవాటే. ఇలాంటి కఠిన పరిస్థితులు చైనా సైన్యానికి కొత్త.

683 ఏళ్ల కిందటి పాఠాలు..

అలవాటు లేకుండా ఈ ప్రాంతంలో యుద్ధానికి దిగడం ప్రమాదకరమని చరిత్ర చెబుతోంది. 683 ఏళ్ల కిందట దిల్లీ సుల్తాన్​ మహ్మద్​ బిన్​ తుగ్లక్​ సాగించిన ఖారాచిల్​ దండయాత్ర ఇందుకు ప్రబల ఉదాహరణ. సరైన సన్నద్ధత, పర్వత ప్రాంత పోరాటంలో అనుభవం లేకుండానే యుద్ధానికి దిగడం వల్ల లక్ష మంది సైనికులను ఆయన కోల్పోవాల్సి వచ్చింది.

ఆ ఉద్దేశంతోనే!

ఖారాచిల్​ అనేది టిబెట్​కు చేరువలో.. నేటి హిమాచల్​ ప్రదేశ్​లో ఉండొచ్చని అంచనా. ఈ మార్గం గుండా చైనాను చేరుకోవచ్చు. అర్థరహిత నిర్ణయాలకు పెట్టింది పేరైన తుగ్లక్​.. 1337లో ఈ ప్రాంతంపై కన్నేశారు. నాడు ఆయనకు సువిశాల సామ్రాజ్యం ఉంది. అయితే ఖారాచిల్​ దండయాత్ర ద్వారా తొలుత టిబెట్​ను, ఆ తర్వాత చైనాపై దాడి చేయాలన్నది తుగ్లక్​ ఉద్దేశమై ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఇందుకోసం ఖుస్రవ్​ మాలిక్​ నేతృత్వంలో దాదాపు లక్ష మందితో కూడిన సైన్యాన్ని ఆయన పంపారు.

విజయాల ఊపులో..

మైదాన ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో విజయాలు సాధించిన ఊపులో ఉన్న తుగ్లక్​ సేన.. తమకు పర్వత ప్రాంత పోరాటాల్లో నైపుణ్యం లేని విషయాన్ని గుర్తించలేదు. ఖారాచిల్​ దండయాత్ర ప్రారంభంలో కొన్ని విజయాలను మాలిక్​ సేన సాధించగలిగింది. దీనికి ఉప్పొంగిపోయి.. తుగ్లక్​కు లిఖిత సమాచారాన్ని పంపింది. తుగ్లక్​ మాత్రం తన సేనను అక్కడే ఆగిపోవాలని ఆదేశాలు పంపినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

విజయగర్వంతో ఉన్న మాలిక్​.. సుల్తాన్​ ఉత్తర్వులను ధిక్కరించినట్లు వారు పేర్కొన్నారు. కారణం ఏదైనాగానీ.. పర్వతాల మీదుగా టిబెట్​లోకి ప్రవేశించేందుకు మాలిక్​ సేన ఉపక్రమించింది. ఈ క్రమంలో ప్రకృతిని తేలిగ్గా తీసుకుంది. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది.

భారీగా ప్రాణనష్టం..

పర్వతాలు దాటే క్రమంలో భారీ వర్షాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్లేగు వ్యాధి ముంచెత్తింది. ఎగువ ప్రాంతంలో ఉన్న శత్రువులు ఈ పరిస్థితిని చక్కగా సొమ్ముచేసుకున్నారు. శిఖరాలపై నుంచి పెద్ద రాళ్లను మాలిక్​ సైన్యంపైకి దొర్లించి, భారీగా ప్రాణనష్టం కలిగించారు. పలాయనం చిత్తగించడమూ తుగ్లక్​ సేనకు కష్టమైపోయింది. వీటన్నింటివల్ల మాలిక్​ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు లక్ష మంది సైనికుల్లో ఓ పది మంది మాత్రమే మనుగడ సాగించారని చరిత్రకారులు చెబుతున్నారు.

దండయాత్రకు కారణాలు..

టిబెట్​, చైనాపై తుగ్లక్​ దండయాత్ర ఆలోచన చేయడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. 'సిల్కు మార్గం' ద్వారా పుష్కలంగా వస్తున్న ధనం ఇందుకు ప్రేరేపించి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా.. అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, ఇది తుగ్లక్​లో ఆందోళన నింపిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఉత్తర సరిహద్దును భద్రంగా ఉంచుకోవడంలో భాగంగా కూడా ఈ ఆలోచన చేసి ఉండొచ్చని పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి:మొదట వైదొలగాల్సింది మీరే: భారత్​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.