జగన్నాథ రథయాత్ర నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఈ తీర్పుతో దేశం మొత్తం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఒడిశా ప్రజలు, జగన్నాథుని భక్తులకు శుభకరమైన వార్తని పేర్కొన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు అమిత్‌షా.
ప్రధానిపై ప్రశంసలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భక్తుల విశ్వాసాలను అర్థం చేసుకుని.. భారతీయ సంప్రదాయాల పరిరక్షణకు అవసరమైన కృషి చేశారని కొనియాడారు షా. ప్రధాని సూచనల మేరకు కేసు విచారణకు ముందు సొలిసిటర్ జనరల్‌తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. పిటిషన్ ప్రాధాన్యం దృష్ట్యా విచారణను సెలవు ధర్మాసనం చేపట్టిందని.. తద్వారా కీలక నిర్ణయం వెలువడిందని వెల్లడించారు.
మహారాజుతో చర్చించాం..
రథయాత్ర నిర్వహణపై పూరీ మహారాజు గజపతి, శంకరాచార్యలతో చర్చించినట్లు చెప్పారు అమిత్‌షా.
మంగళవారం నుంచి రథయాత్ర..
జూన్ 23 నుంచి రథయాత్ర జరగనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో పెద్దసంఖ్యలో గుమిగూడటంపై ఆంక్షలు ఉన్న కారణంగా ఇంతకుముందు యాత్ర నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. సుప్రీం ఇచ్చిన తాజా తీర్పుతో రథయాత్ర నిర్వహణకు మార్గం సుగమమైంది.
ఇదీ చూడండి: జనపనారకు రాగి పూస్తే.. నీటి కాలుష్యానికి చెక్!