తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభనపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైన్యాన్ని ఉపసంహరించుకోవడం తక్షణ కర్తవ్యమని నొక్కిచెప్పింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
"అన్ని ఘర్షణ ప్రాంతాల్లో దళాలను సమగ్రంగా ఉపసంహరించుకోవడం తక్షణ కర్తవ్యం. సెప్టెంబర్ 10న మాస్కోలో ఇరుదేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. "
-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ ప్రతినిధి
ఇరుదేశాలు చర్చలు కొనసాగించాలని అంగీకారానికి వచ్చినట్లు శ్రీవాస్తవ తెలిపారు. వీలైనంత త్వరగా ఇరువురికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు.
చైనాతో సరిహద్దు సమస్యపై ఎనిమిదో విడత సైనిక చర్చలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సమావేశ తేదీ నిర్ణయించకపోయినప్పటికీ.. వచ్చే వారం భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి- సుపరిపాలన, అభివృద్ధి కొనసాగింపుగా జేడీయూ మేనిఫెస్టో