టీకా భద్రత, సమర్థతపై పూర్తిగా విశ్లేషించిన తర్వాతే కొవిడ్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయడం జరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. దేశంలో సార్వత్రిక టీకా పంపిణీ, ఎన్నికల నిర్వహణను బట్టి.. ప్రాధాన్య జాబితాలోని వ్యక్తులకు వ్యాక్సిన్ అందించే కార్యక్రమం విజయవంతం అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోందని అన్నారు. ఫిక్కీ 93వ వార్షిక కన్వెన్షన్‌లో మాట్లాడిన ఆయన.. వ్యాక్సిన్‌పై నిర్ణయం కొద్ది రోజుల్లోనే వెలువడుతుందని చెప్పారు. నియంత్రణ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
"ఈ నిర్ణయాలు శాస్త్రీయ ఆధారంగా తీసుకున్నవి. ఆధారాలు, నియమాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. మన నియంత్రణ సంస్థ సరైన నిర్ణయం తీసుకుంటుంది. సమర్థత, భద్రత, రోగనిరోధకత అంశాలు.. నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. నియంత్రణ సంస్థపై ఏ విధంగానూ ఒత్తిడి లేదు. నేను దీన్ని పూర్తి అధికారంతో చెప్పగలను. మనకు స్వతంత్ర వ్యవస్థలు ఉన్నాయి. వారి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. సరైన నిర్ణయాలు తీసుకోవడమే దేశానికి ముఖ్యం."
-వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు
టీకా అనుమతుల కోసం యూకే నియంత్రణ సంస్థలతో డీసీజీఐ సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు వీకే పాల్.
టీకా పంపిణీ ఏర్పాట్లు
అత్యవసరం ఉన్నవారికి ముందుగా టీకా అందేలా కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు పాల్. టీకా నిల్వ కోసం సంప్రదాయ కోల్డ్ చైన్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సూదులు, సిరంజీలను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ నిర్వహణకు ఐటీ ప్లాట్‌ఫాం నెలకొల్పినట్లు వివరించారు. బ్లాకుల స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని స్పష్టం చేశారు.
భారత్‌లో తయారైన టీకాలు సగం ప్రపంచానికి చేరుకుంటాయని చెప్పారు వీకే పాల్. ఇవాళ రాజీ పడితే రేపు మనల్ని మనం దెబ్బతీసుకున్నవాళ్లం అవుతామని పేర్కొన్నారు.
ముందంజలో మూడు టీకాలు
అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు భారత ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై సమీక్ష నిర్వహించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)... టీకా భద్రత, సమర్థతపై అదనపు సమాచారం అందించాలని ఆయా సంస్థలను కోరింది. సీడీఎస్సీఓ తీసుకునే నిర్ణయాన్ని బట్టి టీకాల వినియోగానికి తుది అనుమతులు లభించనున్నాయి.
ఇదీ చదవండి: కరోనా టీకాలకు త్వరలోనే అనుమతి: కేంద్రం
ఇదీ చదవండి: అంగన్వాడీ కేంద్రాల్లోనే కొవిడ్ టీకా పంపిణీ!