తమిళనాడులోని ఈరోడ్ తలవాడి నుంచి సత్యమంగళానికి చెరకు లోడ్‌తో వెళుతోంది ఓ లారీ. ఇంధనం లేక మైసూర్- సత్యమంగళం జాతీయ రహదారిలోని ఆసనూర్ వద్ద నిలిచిపోయింది. అప్పుడే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అటుగా వచ్చింది ఓ గజరాజం. చెరకు గెడలను చూసి నోరూరిపోయిందేమో...! ఎంచక్కా ఆరగించడం ఆరంభించింది.
చెరకు గెడలను ఆస్వాదిస్తున్న ఏనుగు దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు రహదారి వెంట వెళుతున్న ప్రయాణికులు ఆసక్తి చూపారు. ఈ కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఏనుగును వెనక్కి పంపే సాహసం చేయలేక అటవీ అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు.
ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగును అడవిలోకి పంపించేశారు. అవాంతరం తొలగిపోయి వాహనాలకు మార్గం సుగమమైంది.
ఇదీ చూడండి: 'మన ప్రధానమంత్రి మంచి సేల్స్‌మన్'