"2014 కాదు.... అంతకుమించిన ప్రభంజనం ఖాయం".... ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయంపై ధీమా వ్యక్తంచేస్తూ కమలనాథులు చెబుతున్న మాట ఇది. మహాకూటమి గెలుస్తుందని విపక్ష నేతలు ఈ స్థాయిలో విశ్వాసం వ్యక్తంచేయకపోయినా... అధికారం దక్కుతుందన్న ఆశతోనే ఉన్నారు. సాధ్యమైనన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆరు దశల పోలింగ్ ముగిసేసరికి... సార్వత్రిక ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు దాదాపు ఒకే రకమైన సమాధానం వినిపిస్తోంది.... స్పష్టమైన ఆధిక్యం ఏ పార్టీకీ రాదని. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే సింగ్దీ అదే మాట. ఎన్నికల అనంతరం పొత్తులే... అధికారం ఎవరిదో నిర్దేశిస్తాయని ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పారు.
''2019 ఎన్నికలు 2014లా కాకుండా పూర్తి విభిన్నంగా సాగుతున్నాయి. 6 దశల పోలింగ్ పూర్తయ్యే సరికి ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఏడో దశకు చేరింది. తుది విడత భాజపాకు కీలక పరీక్ష. గత లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఈ దశలో గెలిచారు. భాజపా అధికారంలోకి రావాలంటే ఈ స్థానాలను నిలబెట్టుకోవడం అవసరం.
మెజార్టీ రాని పక్షంలో ఎన్నికల అనంతరం పొత్తుల కోసం ప్రయత్నిస్తాయి. మిగతావాటితో పోలిస్తే భాజపా ఆధిక్యానికి చేరువగా వెళ్లే అవకాశముంది. భాగస్వామ్య పక్షాల సహకారం, ఎన్నికల అనంతరం పొత్తులతో దిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది.''
- ఎంకే సింగ్, రాజకీయ విశ్లేషకులు
ఎన్నికల అనంతరం మహాకూటమి పార్టీలు ఏకాభిప్రాయంతోనే ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు ఎంకే సింగ్.
''ఉత్తర్ప్రదేశ్లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్డీతో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కలిస్తే దేశ రాజకీయ ముఖచిత్రమే మారుతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ సంధి కుదరకపోతే.. భాజపా సర్కార్కు మార్గం సుగమం అవుతుంది. ''
- ఎంకే సింగ్, రాజకీయ విశ్లేషకులు
ఇదీ చూడండి: 'అప్పుడు మోదీ X సోనియా.. మరి ఇప్పుడు?'