సార్వత్రిక ఎన్నికల ఆరో దశ ప్రచారం ముగిసింది. దేశ రాజధాని దిల్లీ సహా ఆరు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఈ దఫా పోలింగ్ జరగనుంది. 979 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మైకులు బంద్
ఆరో దశ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకూ హోరెత్తిన మైకులు బందయ్యాయి. పోల్ మేనేజ్మెంట్లో నేతలు బిజీ అయ్యారు. ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఎన్నికల సంఘం అధికారులు, భద్రతా సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
ఆరు రాష్ట్రాలు... 59 స్థానాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, హరియాణాలో 10, బిహార్, మధ్యప్రదేశ్, బంగాల్లో 8 స్థానాలు, దిల్లీలో 7, జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దఫాలో 10 కోట్ల 17 లక్షల 82వేల 472 మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న యంత్రాంగం
ఆరో దశ ఎన్నికల కోసం ఈసీ లక్షా 13వేల 167 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపులో అధికారులు నిమగ్నమయ్యారు. రేపు సాయంత్రంలోగా ఎన్నికల అధికారులు చేరుకోనున్నారు. ఆరో దశ ఎన్నిక కోసం పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరిస్తున్నాయి.
ఇదీ చూడండి: మోదీపై 'టైమ్' వివాదాస్పద కవర్‌స్టోరీ