ఒడిశాలో బ్యాంకు అధికారుల నిర్వాకం వల్ల.. 120ఏళ్ల బామ్మ పెన్షన్ తీసుకోవడానికి అష్టకష్టాలు పడింది. పెన్షన్ డబ్బును ఉపసంహరించుకోవాలంటే.. బామ్మ కచ్చితంగా బ్యాంకుకు వచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టారు బ్యాంకు అధికారులు. అందుకే నడవలేని స్థితిలోనూ మంచంమీదే పడుకుని కూతురు సాయంతో బ్యాంకు వద్దకు చేరుకుంది ఆ బామ్మ. నౌపాడా జిల్లా ఖారియర్ మండలం బరాగాన్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరి మనసులను కలచివేస్తోంది.
ఇదీ జరిగింది
తన పెన్షన్ ఖాతా నుంచి రూ. 1,500 లను తీసుకొని రమ్మని 70ఏళ్ల తన కూతురు గూంజా డీని పంపింది బామ్మ. కానీ అది పెన్షన్ ఖాతా అయినందున నిబంధనల ప్రకారం సదరు ఖాతాదారే వచ్చి నగదు ఉపసంహరించుకోవాలని అధికారులు పట్టుబట్టారు. నిస్సహాయురాలైన గుంజా డీ.. చేసేదేమీ లేక తన తల్లిని మంచం మీద పడుకోబెట్టుకొని బ్యాంకు వరకు మంచాన్ని లాక్కొని పోయింది. బామ్మను చూసిన అనంతరం అధికారులు ఆమె పెన్షన్ డబ్బులు ఇచ్చారు.
ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవటం వల్ల ఆ ప్రాంత ఎమ్మెల్యే అధిరాజ్ పానిగ్రాహి ఘాటుగా స్పందించారు. ఈ చర్యపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"బ్యాంక్ అధికారులు గత మూడు నెలలుగా ఆ వృద్ధురాలిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అధికారులు అన్ని చట్టాలను ఉల్లంఘించారు. ఈ చర్య మానవ హక్కులకు విరుద్ధం. ప్రజలు వారి హక్కులను పొందాలి. ఈ చర్యను నేను ఖండిస్తున్నాను. వెంటనే ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను వారి పదవి నుంచి తొలగించాలి. దీన్ని ఇలానే వదిలేస్తే ఇలాంటి ఘటనలు మరెన్నో ఒడిశాలోని అన్ని జిల్లాల్లోనూ చూడాల్సి వస్తుంది. "
పానిగ్రాహి ఖారియర్, ఎమ్మెల్యే
ఈ ఘటన అనంతరం వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి సేవలను అందించాలని ఆదేశిస్తూ.. ఒడిశా ప్రధాన కార్యదర్శి.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, షెడ్యూల్డ్ బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీల బ్యాంక్ మేనేజర్లకు లేఖ రాశారు.
ఇదీ చూడండి:గుజరాత్లో మళ్లీ భూకంపం- 24 గంటల్లో రెండోది