భారత్‌తో సైనికబంధం మరింత బలోపేతమయ్యేలా చొరవ చూపుతూ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ‘టైగర్ ట్రయంప్’ను ప్రకటించడం ప్రపంచ దేశాల్లో ఎనలేని ఆసక్తిని రేపింది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఇరుదేశాల త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలపై ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా నిర్వహించనున్న సంయుక్త సైనిక విన్యాసాలతో భారత్, అమెరికా సంబంధాల్లో సరికొత్త బంధానికి తెరలేచింది. భారత - అమెరికా నౌకాదళాలు 1992 నుంచీ ‘మలబార్’ పేరిట సంయుక్త విన్యాసాలు చేపడుతున్నాయి. ఇరు నౌకాదళాల అధికారుల మధ్య పరస్పర అవగాహన ఉంటే భవిష్యత్తులో ఏవైనా ప్రత్యేక ఆపరేషన్లను లోపాలకు తావు లేకుండా నిర్వహించవచ్చనేది సంయుక్త సైనిక విన్యాసాల అంతిమ లక్ష్యం. ఈ ఆపరేషన్లకు సన్నద్ధమయ్యేందుకు కొన్ని ప్రత్యేక కారణాలూ లేకపోలేదు. భారత్‌కు మూడువైపులా ఉండే హిందూ, అరేబియా మహాసముద్రాలు; బంగాళాఖాతంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా శత్రువులపై విరుచుకుపడే తిరుగులేని శక్తిసామర్థ్యాలు దేశ నౌకాదళానికి ఉన్నాయి. ప్రపంచంపై పట్టు సాధించే దిశగా నిరంతరం యత్నించే అమెరికా నౌకాదళానికి- భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలేమిటో తెలుసు. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలపై అమెరికా నౌకాదళానికి విశేషమైన పట్టుంది. అక్కడి సముద్ర వాతావరణానికి సంబంధించిన నైపుణ్యాలు భిన్నంగా ఉంటాయి. వాటితోనే అమెరికా నౌకాదళం అన్నిచోట్లా పోరాడాలనుకుంటే ముప్పు తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే- భారత నౌకాదళంతో జట్టు కట్టేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది. గత 27 ఏళ్లలో వేలమంది అధికారులు, సిబ్బంది సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు చేశారు. ఇరు నౌకాదళాల్లోని జలాంతర్గాములు, విమాన వాహక యుద్ధనౌకలు, విభిన్న రకాల యుద్ధనౌకలు తదితర అన్ని విభాగాల సిబ్బంది పరస్పరం సహకరించుకుని- పలు సైనిక వ్యూహాలను ఉమ్మడిగా అమలు చేయగల నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. సైనిక పరమైన అంశాలే కాకుండా సముద్ర కాలుష్యం, విపత్తుల్లో సహాయక, పునరావాస చర్యలు, సముద్ర దొంగలపై దాడులు, చట్టాల అమలు తదితర అంశాలపైనా ఉమ్మడిగా విధులు నిర్వర్తించి బాధితులకు అత్యంత వేగంగా సేవలు అందించగల స్థాయికి చేరుకున్నారు.
జపాన్ సైతం
భారత్, అమెరికా నౌకాదళాలు ‘మలబార్’ పేరిట చేస్తున్న రక్షణ విన్యాసాల పరమార్థం తెలిసిన జపాన్ సైతం భాగస్వామిగా మారింది. తన తీరాన్ని కాపాడుకునేందుకు పెద్ద దేశాల అండ తప్పనిసరని ఆ దేశం గుర్తించింది. 2007లోనే మలబార్ విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చిన జపాన్, ఆ తరవాత 2015లో భాగస్వామిగా మారింది. ఆస్ట్రేలియా సైతం వీటిపై ఆసక్తి చూపి, విన్యాసాల్లో పాల్గొంది. భారత్, ఆమెరికా నౌకాదళాల సంయుక్త భాగస్వామ్యం తమ నౌకాదళానికి అదనపు అండగా ఉంటుందని ఆ దేశం భావిస్తోంది. మలబార్ విన్యాసాల ఫలితంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల మధ్య నౌకాదళ బంధం మరింత దృఢంగా మారింది. పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాల రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అమెరికా సైన్యంలో ప్రత్యేకంగా ‘ఇండో పసిఫిక్ కమాండ్’ ఏర్పాటైంది. అది బలంగా ఉండాలంటే సమీపంలోని సానుకూల దేశాలన్నీ రక్షణపరంగా పటిష్ఠంగా ఉండాలని అగ్రరాజ్యం కోరుకుంటోంది. అందుకు అవసరమైన అత్యాధునిక పరిజ్ఞానాలను సన్నిహిత నౌకాదళాలకు బదిలీ చేసేందుకూ సంకోచించడం లేదు. అందులో భాగంగానే బహుళ ప్రయోజనకర యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ జలాశ్వ’ను, అత్యంత అధునాతనమైన నిఘా యుద్ధ విమానం ‘పి8ఐ’ని మన దేశానికి విక్రయించింది.
చైనా ఆశలపై నీళ్లు
అమెరికాతో సమానంగా ఆధిపత్యం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న చైనాకు మలబార్ విన్యాసాలు కంటగింపుగా పరిణమించాయి. ప్రత్యేకించి హిందూ మహాసముద్ర ప్రాంతంలో పట్టు పెంచుకోవాలని చూస్తున్న చైనా ఆశలకు మలబార్ బంధం అడ్డంకిగా మారింది. చైనా పెద్ద దేశమైనా తీరప్రాంతం తక్కువ. భారత్‌కు సమీపంలో తన నౌకాదళ స్థావరాలు ఉండాలనే ఉద్దేశంతో శ్రీలంకలోని హబ్బన్‌టోట ప్రాంతంలో పాగా వేసింది. బంగ్లాదేశ్, మయన్మార్, ఫిలిప్పీన్స్, ఆఫ్రికాల నౌకాదళాలతోనూ సయోధ్య సాగిస్తూ, అవసరమైతే, వాటి మౌలిక వసతుల్ని వినియోగించుకునే దిశగా కదలుతోంది. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో గ్వాదర్ ఓడరేవు నిర్మాణానికి, ‘చైనా పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపీఈసీ)’ ఏర్పాటుకు సహకరించి పాకిస్థాన్‌కు సన్నిహిత మిత్రదేశంగా అవతరించింది. భారత్‌తో ఆది నుంచి శత్రుత్వ వైఖరి ప్రదర్శిస్తున్న పాకిస్థాన్‌కు అండదండలు అందిస్తూ ఆ దేశ నౌకాదళాన్ని, నౌకాదళ వసతుల్ని కూడా వినియోగించుకునే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తన ఆధిపత్యానికి గండికొట్టడానికే అమెరికా మలబార్ విన్యాసాలు చేస్తోందని చైనా భావిస్తోంది.
త్రివిధ దళాలు ఉమ్మడిగా
భారత్ ఇప్పటిదాకా రష్యాతో మాత్రమే ‘ఇంద్ర’ పేరిట త్రివిధ దళాల సైనిక విన్యాసాలు చేసింది. మొట్టమొదటిసారిగా భారత్, అమెరికా త్రివిధ దళాలు టైగర్ ట్రయంప్ పేరిట ఉమ్మడి విన్యాసాలు చేయనున్నాయి. ఈ నెల 13 (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఇరు దేశాలకు చెందిన మొత్తం 1,200 మందికి పైగా సిబ్బంది సంయుక్త విన్యాసాల్లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఇరు దేశాల నౌకా, వాయు, పదాతి దళాలు దేనికవే సంయుక్త విన్యాసాలు చేశాయి. ఇప్పుడు త్రివిధ దళాలూ ఉమ్మడిగా ఇందుకు ఉపక్రమిస్తున్నాయి. దీంతో రక్షణ పరంగా భారత్ అత్యంత కీలక మైలురాయిని అధిగమించినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రచయిత - బి.ఎస్.రామకృష్ణ