2018 ఆగస్టులో కేరళలో ఉగ్రరూపం దాల్చిన వరదలు శంకరకుట్టి కుటుంబాన్నే కాదు ఎన్నో వేల మంది కేరళీయులను నిరాశ్రయులను చేశాయి. ప్రత్యేకించి నాటి వరదలకు తీవ్రంగా నష్టపోయిన అలెప్పీ ప్రాంతంలో... బాధితులకు పునరావాసం కల్పించేలా అప్పటి అలెప్పీ సబ్ కలెక్టర్, ప్రస్తుత పర్యాటక శాఖ ఏడీజీ మైలవరపు కృష్ణతేజ సామాజిక మాధ్యమాల వేదికగా 'ఐయాం ఫర్ అలెప్పీ' అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రామోజీ ఫౌండేషన్ ముందడుగు వేసింది. రూ.7.7 కోట్ల 'ఈనాడు సహాయ నిధి'తో 8 నెలల్లోనే 121 ఇళ్లను అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించి లబ్ధిదారులకు 'ఈనాడు గ్రూప్' అందించింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేతుల మీదుగా లబ్ధిదారులు నూతన గృహాల తాళాలను అందుకున్నారు. ఇంటి నిర్మాణంలో చేపట్టిన ప్రత్యేక జాగ్రత్తలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఊహించి నిర్మించిన కట్టడాలు ప్రస్తుత ఆపత్కాలంలోనూ అండగా నిలిచాయి.
ఎత్తైన పునాది
సమీపంలోని ఇళ్ల నిర్మాణానికి భిన్నంగా ఒకటిన్నర మీటర్ల ఎత్తులో ప్రత్యేకంగా నిర్మించిన ఇళ్లన్నీ గత కొద్ది రోజులుగా కేరళను ముంచెత్తుతున్న వరదలకు చెక్కు చెదరలేదు. సముద్ర మట్టం కన్నా ఒకటిన్నర మీటర్ల ఎత్తులో పునాదులు ఉండటంతో వరద నీరు ముంచెత్తినా ఈనాడు ఇళ్ల మెట్లను మాత్రమే తాకగలిగాయి. ఇన్నాళ్లూ వరదలు వచ్చినప్పుడల్లా తీవ్రంగా ఇబ్బంది పడిన అలెప్పీ వాసులు ఇప్పుడు రామోజీ ఫౌండేషన్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. తమ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
అంతేకాదు... ఈనాడు ఇళ్ల పక్కన వరదల్లో చిక్కుకున్న స్థానికులకు ఇప్పుడా ఇళ్లు పునరావాస కేంద్రాలుగా మారాయి. సేవాభావానికి తోడు ఆలోచన, దార్శనికతతో ప్రణాళికలు రచిస్తే భవిష్యత్తులోనూ వాటి ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి నిదర్శనంగా ఈనాడు ఇళ్లు నిలుస్తున్నాయని ఈ పునరావాస కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో అలెప్పీ వాసులకు అండగా నిలబడిన రామోజీ ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: ఫేస్‌బుక్ టార్గెట్- కాంగ్రెస్, భాజపా మాటల యుద్ధం