బ్రెజిల్ రాజధాని బ్రసీలియా నగరం వేదికగా రెండురోజుల ‘బ్రిక్స్’ పదకొండో శిఖరాగ్ర సదస్సు సభ్యదేశాల మధ్య ఇతోధిక ఆర్థిక వాణిజ్య సహకారాన్ని అభిలషిస్తూనే- ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు చేతులు కలపాలని పిలుపిచ్చింది. అందరికీ సమానావకాశాలు సమకూర్చే ప్రపంచ నిర్మాణమే లక్ష్యంగా పదేళ్ల కిందట ఆవిర్భవించిన కూటమి, ప్రగతిపథ ప్రస్థానంలో ముళ్లకంపల్ని సక్రమంగానే గుర్తించింది! నాలుగు వేర్వేరు ఖండాలకు చెందిన అయిదు దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కదంబం ‘బ్రిక్స్’. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు రూపేణా వాణిజ్య యుద్ధం కొనసాగితే వచ్చే ఏడాది ప్రపంచ స్థూలోత్పత్తిలో అరశాతం కోసుకుపోవడం తథ్యమని, ఆ మొత్తం దక్షిణాఫ్రికా ఆర్థికవ్యవస్థ పరిమాణానికి సమానమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఇటీవల హెచ్చరించడం తెలిసిందే. అనుచిత వాణిజ్య స్పర్ధతో కుంగుదలను మించి ఉగ్రవాదం మరెంతగా తీవ్ర దుష్పరిణామాలు వాటిల్లజేస్తున్నదీ బ్రిక్స్ నేతల ప్రసంగాలు పూసగుచ్చాయి. ప్రధాని మోదీ మాటల్లో- ఉగ్రవాద ప్రకోపం మూలాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షకోట్ల డాలర్ల సంపద కోల్పోయింది; గత పదేళ్లలో 2.25 లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
వాస్తవానికి, న్యూయార్క్‌లో ఏడువారాల క్రితం సమావేశమైన ‘బ్రిక్స్’ దేశాల ప్రతినిధులు- అంతర్జాతీయంగా ఉగ్రవాద నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సత్వరం అమలుపరచాలని ముక్తకంఠంతో తీర్మానించారు. ఆ సమైక్య స్ఫూర్తే ఇప్పుడు- రసాయన, జీవాయుధ ప్రయోగం సహా ఏ రూపంలోనైనా ఉగ్రవాద ఘాతుకాల్ని ఖండించాల్సిందేనన్న సంయుక్త తీర్మాన పాఠంగా హెచ్చుశ్రుతిలో ప్రతిధ్వనిస్తోంది. ఏడాదిన్నర క్రితం మనీలాండరింగ్, ఉగ్రనిధుల సరఫరాల కట్టడికి తగిన చర్యలు తీసుకోని పాకిస్థాన్‌ను బోనెక్కించాల్సిందేనని అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీలు ఉమ్మడిగా తీర్మానించాయి. అటువంటి యత్నాలకు చిరకాలంగా ‘సాంకేతిక ప్రతిబంధకాలు’ సృష్టిస్తున్న చైనా సైతం సహేతుక ధోరణి కనబరిస్తేనే తప్ప ఉగ్రవాద వ్యతిరేక పోరు గాడిన పడదు!
పదేళ్ల ప్రగతి ప్రశ్నార్థకం
పదేళ్లుగా ‘బ్రిక్స్’ సభ్యదేశాల నడుమ సమన్వయం, సహకారం, సామరస్యం ఏ మేరకు పరిఢవిల్లాయన్న ప్రశ్నకు- పెద్దగా ఎదుగూబొదుగూ లేని వాణిజ్య పద్దే జవాబు. విశ్వవాణిజ్య పరిమాణంలో బ్రిక్స్ దేశాల మధ్య జరుగుతున్నది కేవలం 15 శాతమేనన్న నిష్ఠుర సత్యాన్ని తన ప్లీనరీ ప్రసంగంలో ప్రధాని మోదీ సూటిగా ప్రస్తావించారు. ప్రపంచ జనాభాలో 42 శాతానికి, అంతర్జాతీయ జీడీపీలో 23 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్ దేశాలు తమలో తాము పరస్పర సమన్వయంతో వాణిజ్య బంధాన్ని దృఢతరం చేసుకోవాల్సిన అవసరమెంత ఉన్నదీ ఇకనైనా గుర్తెరగాలి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితరాల్ని వెనక్కినెట్టి అమెరికా, జపాన్లతోపాటు ‘బ్రిక్స్’ దేశాలు ఆర్థిక దిగ్గజ శక్తులుగా అవతరించనున్నాయన్న అంచనాలు గతంలో వెలువడ్డాయి.
ఎప్పటికప్పుడు ఇంధన ఆహార ఆరోగ్య భద్రత, అంతర్జాతీయ వ్యవస్థల్లో సంస్కరణలే మౌలిక అజెండాగా వరస తీర్మానాలు వండివారుస్తున్న బ్రిక్స్ కూటమి, ‘ఒకే మాట- ఒకే బాట’గా వ్యవహరిస్తేనే బంధం బలపడి ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయి. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, యూరేసియా ఆర్థిక సంఘాలు కలివిడిగా నూతన బహుళ ధ్రువ ప్రపంచ సరళికి పాదు చేయగలవని లోగడ ఘనంగా చాటిన చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్ సహా కూటమి నేతలందరూ నిజాయతీగా ముందడుగు వేయాలేగాని- సాధించలేనిది ఏముంటుంది? భారత్‌లో అపార అవకాశాలను, సులభతర వాణిజ్య వాతావరణాన్ని తోటి సభ్యదేశాలు సద్వినియోగపరచుకోవాలని ప్రధాని మోదీ మళ్ళీ ఆహ్వానించారు. ఇటీవలి అంతర్జాతీయ పోటీతత్వ సూచీ ర్యాంకింగుల పరంగా బ్రిక్స్ కూటమిలో భారత్, బ్రెజిల్ అట్టడుగున నిలిచాయి. అవినీతి, విద్యుత్ పంపిణీ, రవాణా వసతుల రీత్యా సవాళ్లను చురుగ్గా అధిగమించగల సంస్కరణలే ఇక్కడికి దండిగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తాయి!
మార్పులు ఆవశ్యకం
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో కూడిన ‘బ్రిక్’ (అప్పటికి దక్షిణాఫ్రికా చేరలేదు) తొలి భేటీ ఏకధ్రువ ప్రపంచ పోకడల్ని గర్హించి, అంతర్జాతీయ వ్యవహారాలు న్యాయబద్ధంగా ఉండాలని గళమెత్తింది. పదేళ్లు గతించిన తరవాతా, నాడది అభిలషించిన పరివర్తన ఎండమావినే తలపిస్తోంది. బ్రసీలియా శిఖరాగ్ర సదస్సు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి- మూడింటా మార్పుల ఆవశ్యకతను ఎలుగెత్తడానికి కారణమదే! ఆధునిక కాల సవాళ్లను దీటుగా ఎదుర్కోగలిగేలా ఐరాస గతిరీతులు, భద్రతామండలి స్వరూప స్వభావాలు మారితీరాల్సిందేనన్న భారత్ వాణి విశ్వవేదికలపై తరచూ మార్మోగుతోంది. ఆ సహేతుక డిమాండును సంయుక్త తీర్మానంలో ప్రతిధ్వనింపజేసిన ‘బ్రిక్స్’ కూటమి ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ తీరుతెన్నుల్నీ తూర్పారపట్టింది.
బృందంలో ఒకలా, విడిగా మరోలా..
బృందంలో ఒక లాగా, విడిగా మరోరకంగా మసలే చైనా ధోరణే కొరుకుడు పడటంలేదు. వివిధ సందర్భాల్లో తక్కిన వీటో దేశాలు సుముఖత వ్యక్తపరచినా, భద్రతామండలిలో ఇండియా శాశ్వత సభ్యత్వానికి చైనా మోకాలడ్డుతోంది. బీజింగ్ తీరు మారనిదే, ఐక్యరాజ్య సమితిలో ‘బ్రిక్స్’ కోరుతున్న సంస్కరణలు సాకారమయ్యే వీల్లేదు. ఎందుకంటే- భద్రతామండలి పరిమాణం, అధికారాల్లో ఎటువంటి మార్పులు చేపట్టాలన్నా శాశ్వత సభ్యదేశాల సమ్మతి ఉండితీరాలని సమితి ఛార్టర్ స్పష్టీకరిస్తోంది. వేరే మాటల్లో, బ్రిక్స్ అభిమతం నెరవేరడానికి ప్రధాన అవరోధం ఆ కూటమిలోని కీలక సభ్యదేశమే. భౌగోళిక సామీప్యం, సైద్ధాంతిక సారూప్యం వంటివి లేకపోయినా ఒక గొడుగు కిందకు చేరిన అయిదు బ్రిక్స్ దేశాలు ప్రభావాన్విత కూటమిగా ఎదగాలంటే- ఆత్మశోధనతో అవి తొలుత ఇంట గెలవాల్సిందే!