‘నా దేశం భగవద్గీత... నా దేశం అగ్నిపునీత సీత’ అంటూ జ్ఞానపీఠాధిపతి స్వర్గీయ సినారె కీర్తిగానం చేశారు. సహస్రాబ్దాల సంస్కృతీ విభవంతో నైతికత నాగరికతల కలబోతగా ఒకనాడు ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన దేశంపై పైశాచిక శక్తుల అసుర సంధ్య దట్టంగా ముసురేసిందిప్పుడు! ‘నా దేశంలో నాకెందుకు భద్రత లేదు?’ అంటూ బిహారుకు చెందిన యువతి పార్లమెంటు ఎదుట వేసిన ప్రశ్న- ఈ జాతి జనావళి గుండెఘోషకు ప్రతిధ్వని.
ఇంకెప్పుడు మార్పు?
2012 నాటి నిర్భయ దురాకృతం తరవాత యావద్దేశాన్నీ కంటతడి పెట్టించి, అసుర మూకల ఉసురు తీయాల్సిందేనంటూ చిన్నాపెద్దా ఊరూవాడా ఒక్క తీరుగా కదిలేలా హైదరాబాద్ దుర్మార్గం కదిలించింది. దేశవ్యాప్తంగా దశదిశలా ఆడపిల్లల మానప్రాణాల్ని కబళిస్తున్న కామాంధ నరవ్యాఘ్రాల దూకుడుకు పట్టపగ్గాల్లేకపోవడంపై పార్లమెంటులో ఉభయసభలూ స్పందించాయి.
చట్టాల సవరణకు సంసిద్ధమంటున్న మోదీ ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలుపడేలా చూస్తామని ప్రకటించింది. ‘కావాల్సింది రాజకీయ సంకల్పమే తప్ప కొత్త బిల్లులు కాదు’ అని రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు చేసిన ప్రకటన పూర్తిగా అర్థవంతం. ‘లైంగిక దాడుల కేసుల్లో ఏం చేస్తున్నారు, నిర్భయ నిధి పరిస్థితేమిటి’ అంటూ జాతీయ మానవ హక్కుల సంఘం కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆరా తీయబోవడం- కంటితుడుపు వ్యవహారం! జాతిని ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ ఉదంతం జరిగిన 2012లో దేశవ్యాప్తంగా నమోదైన అత్యాచార ఘాతుకాలు 24,923. పిమ్మట నిర్భయ చట్టం తెచ్చి, మహిళల భద్రతకు ఏటా వెయ్యి కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేసి, కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు పెట్టిన తరవాత అయిదేళ్లకు 2017లో 32,559 అత్యాచార కేసులు నమోదు కావడం- రాజ్యవ్యవస్థలోని డొల్లతనాన్నే ఎలుగెత్తి చాటుతోంది.
ఇండియాలో పర్యటించే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అమెరికా, బ్రిటన్లు చేస్తున్న హెచ్చరికలు- దేశ ప్రతిష్ఠకు ఏడు నిలువుల లోతు పాతరేస్తున్న వాస్తవం గ్రహించైనా ప్రభుత్వాలు తగురీతిన స్పందిస్తాయేమో చూడాలి!
గర్భం నుంచే..
‘జీవితాన్ని చక్కదిద్దుకొనే హక్కు మగవాళ్లకు ఎంత ఉందో ఆడవారికీ అంతే ఉంది’ అని ఏనాడో తీర్మానించారు మహాత్మాగాంధీ. భారత రాజ్యాంగ పీఠికా లింగసమానత్వ భావనకు పట్టం కట్టినా- సంబంధిత సూచీలో మొత్తం 129 దేశాల జాబితాలో ఇండియా 95వ స్థానంలో నిలవడం సిగ్గిలజేస్తోంది.
ఏడు పదుల గణతంత్ర భారతంలో ఎక్కడికక్కడ రాక్షసగణ తంత్రాలకు- గర్భస్థ శిశుదశ నుంచే ఆడతనం అమానుష దాడుల బారినపడటం నానాటికీ పెరిగిపోతున్నది. ‘మహిళలు, ఆడపిల్లలపై ఆటవిక హింసకు మూలకారణాలు శతాబ్దాలుగా సాగుతున్న పురుషాధిక్య భావ జాలంలో ఉన్నా’యని మొన్న నవంబరు 25న స్త్రీలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినం సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి చేసిన విశ్లేషణ సరైనదే.
ఎంత దౌర్భాగ్యం?
స్త్రీ పురుష సమానత్వంపై చట్టాలుచేయడం కాదు, భావితరాల్లో ఆ భావనకు ప్రోదిచేసేలా బడిఈడు పిల్లలకు శ్రద్ధగా బోధించి, సమున్నత సంస్కృతికి పాదుచెయ్యాలన్న సంకల్పం ఏలికల్లో లేకపోవడమే- అచ్చోసిన మృగాళ్ల విచ్చలవిడితనానికి కారణమవుతోంది. ఒక్క 2017లోనే దేశవ్యాప్తంగా స్త్రీలపై నేరాలు దాదాపు మూడు లక్షల 60వేలకు చేరాయి. లైంగిక హింసకు గురైన మహిళల్లో ఫిర్యాదు చేసినవారు 0.01 శాతం కన్నా తక్కువేనన్న నేరగణాంకాల బ్యూరో లెక్క- జాతి నైతికత ఏ పాతాళపు లోతులకు పతనమైందో ఎలుగెత్తుతోంది.
నత్త నడకన విచారణలు
నిర్భయ దోషులకే ఇప్పటికీ శిక్ష అమలుకాని దౌర్భాగ్యం కళ్లకు కడుతోంది. అత్యాచార కేసుల్లో కోర్టు విచారణలు నత్తలకే నడకలు నేర్పుతుంటే, నేర నిర్థారణలు పట్టుమని మూడోవంతు కూడా లేకపోవడం- స్త్రీమూర్తుల కన్నీటి జడికి నేరన్యాయ వ్యవస్థ సైతం తగురీతిన స్పందించడం లేదనడానికి తార్కాణం. ఈ అమానుషం ఇంకెంతకాలం?
‘చదివి ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా?’ అన్న తరతరాల ఛీత్కారాలకు క్రమంగా కాలంచెల్లుతున్న నేపథ్యంలో- స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకొని ఉన్నత విద్యాగంధం అందుకోవడానికి 48.6 శాతం ఆడపిల్లలు సంసిద్ధంగా ఉన్న సమయమిది.
దేశ శ్రామిక శక్తిలో మహిళల వాటా కనిష్ఠంగా 29 శాతమే ఉండటం భారత్ ప్రగతిని దెబ్బతీస్తున్న తరుణంలో- రెక్క విప్పుతున్న మహిళా చేతన గొప్ప భవిష్యత్తుకు నాందీ వాచకంగా నిలుస్తోంది. మగపిల్లలకు ఏ మాత్రం తీసిపోమంటూ సకల రంగాల్లో శక్తి చాటుకొంటూ దూసుకొస్తున్న ఆడపిల్లలకు- వ్యక్తిగా, వ్యష్టిగా, సామాజికంగా, పాలన పరంగా అందుతున్న భద్రత ఏ పాటి? అభివృద్ధి క్రమంలో భాగస్వామ్యం, న్యాయం, భద్రత- ఈ మూడు కీలకాంశాల ప్రాతిపదికన మహిళలకు చేదోడువాదోడుగా ఉండటంలో ఇండియా 167 దేశాల్లో 133వ స్థానంలో ఉంది. 2017లో 28,750 అత్యాచార కేసులపై కోర్టులు విచారణ జరిపితే, కేవలం 1070 కేసుల్లోనే నేరనిర్ధారణ జరిగిందంటే ఏమనుకోవాలి?
వ్యవస్థ మారాలి ఇలా..
ఎన్నో ప్రతిబంధకాలకు ఎదురీది తమ భవిష్యత్తు తామే నిర్మించుకోవడానికి తరలివస్తున్న ఆడపిల్లలకు సరైన భద్రత కల్పించడంలో విఫలమవుతున్న రాజ్యవ్యవస్థ- న్యాయం చెయ్యడంలోనూ చతికిలపడటమే వైపరీత్యం. నిర్దేశిత కాలావధిలో నేరగాళ్లకు కఠిన శిక్షలు పడితే, దేశం నేరగాళ్ల అభయారణ్యంలా మారే అవకాశమే లేదన్న నిపుణుల సూచనలు శిరోధార్యం. దానితోపాటు ఆడపిల్లల పట్ల మర్యాద మన్నన చూపడం, వారి భద్రతకు పూచీపడటం అందరి కర్తవ్యమన్న సంస్కార బీజాల్ని పిల్లల మనసుల్లో నాటేలా పాఠ్యాంశాల కూర్పు సాగాలి.
‘తాను భద్రంగా ఉన్నానని భారత మహిళ ఎప్పుడు భావించగలుగుతుంది?’ అని మోదీ 2013 గాంధీ జయంతి నాడు ట్వీట్ చేశారు. దానికి సమాధానాన్నే నేడు జాతి జనులు తెలుసుకోవాలనుకొంటున్నారు!
ఇదీ చదవండి:ఆమె పాదాలతో గీసిన చిత్రాలకు విదేశీయులు ఫిదా