నూతన విద్యా విధానం- 2020తో ప్రైమరీ, ఉన్నత విద్యలో మార్పులు వస్తాయని ఆశిస్తున్నప్పటికీ.. కొవిడ్-19 వంటి పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలన్న దానిపై ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదని అభిప్రాయపడ్డారు ప్రముఖ విద్యారంగ నిపుణులు కమల్గౌర్. మహమ్మారులతో సంక్షోభ పరిస్థితులు ఏర్పడితే.. విద్యార్థులు నష్టపోకుండా, చదువుకు ఆటంకం కలుగకుండా ఏం చేయాలి? అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదని ఆమె 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో అభిప్రాయపడ్డారు.
ప్రశ్న: 10+2 స్థానంలో 5+3+3+4ను తీసుకొచ్చారు. మరో 15 ఏళ్లు ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. దీనితో దేశంలోని విద్యావ్యవస్థపై ఎలాంటి మార్పు రావొచ్చు.?
జవాబు: ఈ విధానం లక్ష్యాన్ని చూస్తే.. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు చాలా రంగాలు, విభాగాల్లో మార్పులు వస్తాయి. ఫౌండేషన్ కోర్సు ద్వారా ప్రారంభ అభ్యాసానికి అవకాశం ఏర్పడింది. అయితే ఇందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఈ నూతన విద్యా విధానంతో అనుకున్న లక్ష్యాలను అందుకోవడం, 100 శాతం ఫలితాలు సాధించడానికి ఎలాంటి రోడ్‌మ్యాప్‌లు లేవు.
ప్రశ్న: చిన్నారులకు పాఠశాల విద్య ఒకటో తరగతి నుంచే ప్రారంభమవ్వాలని ఉంది కానీ కొన్ని ప్రైవేటు స్కూళ్లు కిండర్‌గార్డెన్ అని పేర్లు పెట్టి అప్పట్నుంచే విద్యతో వ్యాపారం చేస్తున్నాయి. అయితే కొత్త విధానంలో వాటిపైనా దృష్టిసారిస్తే బాగుండేది అనే సూచనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం.?
జవాబు: ప్రారంభ అభ్యాసాన్ని స్కూల్ విద్యలో చేర్చడం అభినందనీయం. సేవ్ ద చిల్డ్రన్ సంస్థ సహా పలువురు విద్యారంగ నిపుణలు, సంస్థలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లేముందు అంగన్వాడీ, ప్రీ స్కూల్స్ బాగా ఉపయోగపడనున్నాయి. చిన్నారులు పాఠశాలలకు వెళ్లడం అలవాటు చేసుకునేందుకు ఇవి బాగా తోడ్పడతాయి. ఫలితంగా స్కూళ్లలో ఎక్కువ మంది చిన్నారులతో కలిసి చదువుకునేందుకు విద్యార్థి పెద్దగా ఇబ్బందిపడడు.
ప్రశ్న: అర్థమెటిక్ బేసిక్స్‌పై పట్టు సంపాదించడం, రాయడం, చదవడం వంటి స్కిల్స్ చిన్నారులకు చాలా ముఖ్యం. జీవితంలో విజయవంతం అవడానికి అవి బాగా తోడ్పడతాయి. ఫౌండేషన్ లెర్నింగ్ గురించి కాస్త వివరంగా చెబుతారా?
జవాబు: ప్రీ స్కూల్ తర్వాత ఫౌండేషన్ లెర్నింగ్ ఉంటుంది. బోధన, అభ్యాస పద్ధతులు ఇందులో భాగం. ప్రీ స్కూల్లో చదవడం, రాయడం గురించి మాట్లాడము. ఫౌండేషన్ లెర్నింగ్‌లో మాత్రం గణితంపై పట్టు సాధించేందుకు తరగతులు ఉంటాయి. ఇది నిజంగా మంచి నిర్ణయం.
ప్రశ్న: భారతదేశ విద్యా విధానంలో పిల్లలు 'బట్టి' చదువులకే ఎక్కువ మెగ్గుచూపుతున్నారని ఓ విమర్శ ఉంది. మిగతా దేశాల్లో క్రిటికల్ థిక్కింగ్, ప్రశ్నలు అడగటడం వంటివి చిన్నారులకు నేర్పిస్తున్నారు. ఈ నూతన విధానంలో వాటిపై దృష్టి పెడుతున్నారా?
జవాబు: విద్యార్థి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం చాలా ముఖ్యం. అయితే విదేశీ విధానం తరహాలో మార్పులకు సరిపడా నిధులు ఏవి? విద్యలో సాంకేతికత సహా ప్రైవేటు స్కూళ్లపై పర్యవేక్షణ
గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ప్రాక్టికల్‌గా అమలు చేసేందుకు ఇబ్బందులను దాటి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
ప్రశ్న: రెండేళ్ల బీఈడీ కోర్సును 4 ఏళ్ల డిగ్రీగా మారుస్తున్నారు. ఇది మంచిదేనా.?
జవాబు: ఇది చాలా ముఖ్యమైనది. చాలా మంది టీచర్లు ప్రొఫెషనల్ ట్రైనింగ్ పూర్తిచేయట్లేదు. కేవలం 14 నుంచి 15 శాతం మాత్రమే శిక్షణను పూర్తి చేస్తున్నారు. టీచర్లు విద్యకు సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోతే విద్యా నాణ్యత తగ్గుతుంది. స్కూళ్ల స్థాయిలో చిన్నారుల విద్యా నైపుణ్యాలపై అది ప్రభావం చూపిస్తుంది.
ప్రశ్న: ఏఎస్ఈఆర్, ఎన్ఏఎస్ సర్వేల ప్రకారం చూస్తే విద్యార్థుల చుదువుతున్న తరగతులు, వారి జ్ఞానసముపార్జనకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఈ కొత్త విధానంతో అందులో మార్పు వస్తుందా..?
జవాబు: నూతన విద్యా విధానం అమలుకు సరైన రోడ్‌మ్యాప్ లేదు. ఎలాంటి ఏరియాల్లో అభివృద్ధి చేయాలనేదానిపై నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. సాంకేతికత వినియోగం పెంచాలని అభిప్రాయపడుతున్నారు. అందుకు పెట్టుబడి అవసరం. కరోనా వల్ల ఇప్పటికే చాలా ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యను కొనసాగించేందుకు పాలసీలో ఎలాంటి ప్లాన్లు లేదు. విద్యార్థుల భద్రతా అంశాలు వాటిల్లో పేర్కొనలేదు. ఇలాంటి మహమ్మారులు, ఎమర్జెన్సీలోనూ ఒక్కరోజూ చదువును నష్టపోకూడు. అప్పడే విద్యార్థులు నేర్చుకోవడంలో విజయవంతం అవుతారు.
ప్రశ్న: విద్యారంగంలో పెట్టుబడులు లేవంటున్నారు. మరి అందరికీ అనుమతి ఇస్తే మంచిదేనా.?
జవాబు: అది రాష్ట్రాలు, ప్రభుత్వాల నిర్ణయం. విద్యారంగంలో పెట్టుబడులకు నేనేమి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వాలు విద్యారంగంపై దృష్టి సారించాలి. ఎక్కువ నిధులు కేటాయించాలి. ప్రైవేటు రంగంపైనా ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్ నిబంధన అమలు చేయాలి. నిర్బంధ విద్యకు ఇదే కీలకమైన అంశం.