మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఇందుకోసం దిల్లీలోని ఆయన నివాసానికి శనివారం ఉదయం వెళ్లింది ముగ్గురు అధికారుల బృందం.
ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అహ్మద్ పటేల్‌కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్ పటేల్ తన అశక్తత వెలిబుచ్చారు. ఆయన విజ్ఞప్తిని అమోదించిన ఈడీ, దర్యాప్తు బృందాన్ని మధ్య దిల్లీలోని మదర్ థెరిసా క్రిసెంట్ వద్దనున్న ఆయన ఇంటికే పంపేందుకు అంగీకరించింది.
గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ, ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. అనంతరం చెల్లింపులు లేకపోవటంతో దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.8,100 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంస్థ యజమానులైన చేతన్ సందేశారా, నితిన్ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై సీబీఏ అక్టోబర్ 2017లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నీరవ్ మోదీకి సంబంధమున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కంటే సందేసారా సోదరుల కుంభకోణం మరింత పెద్దదని ఈడీ గతంలో ప్రకటించింది.