మనీలాండరింగ్ ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడైన ఇక్బాల్ మిర్చి భార్య నుంచి ఆస్తులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్ పటేల్‌ను ఈడీ విచారించనుంది. ఇందుకోసం ఈ నెల 18న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా 18న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు పటేల్‌కు సమన్లు జారీచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఖండించిన ప్రఫుల్ పటేల్
ఆరోపణలను ప్రఫుల్ పటేల్ తోసిపుచ్చారు. తనపై అనవసరంగా నిరాధార నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. మీడియాకు లీకైన దస్తావేజులు తన దృష్టికి ఎప్పుడూ రాలేదన్నారు.
ఇదీ సంగతి
ఈడీ కథనం ప్రకారం పటేల్ ఆధ్వర్యంలో నడిచే మిలీనియం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2006-07 సంవత్సరంలో సీజే హౌస్ అనే బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించింది. అందులోని మూడు, నాల్గవ అంతస్థులను మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ పేరిట రాశారు. భవనం నిర్మించిన స్థలానికి మిర్చి యజమాని. అయితే ఆ స్థలాన్ని మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల సరఫరా వంటి అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయంతో కొనుగోలు చేశారన్నది ఈడీ ప్రధాన అభియోగం.