నీరవ్ మోదీ కేసును విచారిస్తోన్న ముంబయి జోన్ జాయింట్ డైరక్టర్ సత్యబ్రత్ కుమార్ను బదిలీ చేస్తున్నట్లు పశ్చిమ జోన్ ప్రత్యేక డైరక్టర్ వినీత్ అగర్వాల్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం నీరవ్ మోదీ బెయిల్ విచారణ నిమిత్తం సత్యబ్రత్ కుమార్ లండన్లోనే ఉండటం గమనార్హం.
బదిలీ వార్త బయటకు రాగానే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఈడీ డైరక్టర్ సంజయ్ మిశ్రా కుమార్ స్పందించారు. వెంటనే బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు.
ఇదీ చూడండి :మాల్యా, నీరవ్ కేసుల్లో నేడు కీలక నిర్ణయాలు!
ఎందుకు..?
విచారణ అధికారిని 5 సంవత్సరాలకు మించి కొనసాగించకూడదని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్లో నిబంధన ఉంది. కుమార్ 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. ప్రధాన కార్యాలయం నుంచి ఆయన కొనసాగింపుపై ఎటువంటి ఆదేశాలు అందలేదు. దీంతో కుమార్ని తప్పించి అగర్వాల్ అనే మరో అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఇది సాంకేతిక కారణమేనని ఈడీ తెలిపింది.
ఈడీ డైరక్టర్ సంజయ్ మిశ్రా కుమార్ ఈ బదిలీని రద్దు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. సత్యబ్రత్ కుమార్ బదిలీ విషయంపై మీడియాలో వచ్చిన వివిధ కథనాలను ట్విట్టర్లో ఖండించింది ఈడీ.