ఉగ్రవాద సంస్థలకు నిధుల కేసు విచారణలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో 13 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. బందిపొరాలోని మహ్మద్ షఫీ షాతో పాటు మరో ఆరుగురు స్థానికులకు చెందిన రూ.1.22 కోట్లు విలువ చేసే ఆస్తులను అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టం(పీఎమ్ఎల్ఏ)కింద ఈడీ అటాచ్ చేసింది.
సలావుద్దీన్ నేతృత్వంలోని హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థను ప్రపంచ దేశాలు నిషేధించాయి. కశ్మీర్లో ఈసంస్థ కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.
"జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు, ఉగ్రకార్యకలాపాలకు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ నిధులు సమకూర్చుతోంది. పాకిస్థాన్‌కు చెందిన సలావుద్దీన్ ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు. 'జమ్మూ అండ్ కశ్మీర్ అఫెక్టీస్ రిలీఫ్ ట్రస్టు' ద్వారా హవాలా, ఇతర పద్దతుల్లో డబ్బును చేరవేస్తున్నాడు."
- ఈడీ ప్రకటన
ఈకేసుతో సంబంధమున్న మహ్మద్ షఫీ షా దిల్లీలోని తీహార్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.