ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి గురువారం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ నెల 9న యూపీలోని మేరట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఆదిత్యనాథ్... సార్వత్రిక ఎన్నికలు రెండు మతాలకు మధ్య జరిగే పోటీగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల సంఘం నోటీసులు అందించింది.
మాయావతికీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7న దేవ్బంద్లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన బీఎస్పీ అధినేత్రి... ఓ రాజకీయ పార్టీకి ఓటు వేయొద్దని ముస్లింలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి పలువురు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై నివేదిక అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని మాయావతిని ఈసీ ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే ఎలాంటి సమాచారం లేకుండానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇదీ చూడండీ: 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శూన్యం