నల్ల బంగారం భయపెడుతోంది. విద్యుదుత్పత్తిలో కీలక ధాతువుగా అక్కరకొచ్చే బొగ్గు విషధూమంగా మారి మనిషి మనుగడకు ముప్పు తెస్తోంది. దేశ విద్యుదవసరాలు నెరవేర్చే క్రమంలో అత్యధికంగా బొగ్గుపై ఆధారపడటం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి శాపంగా మారుతోంది. 2016-17 మధ్య కాలంలో 50 కోట్ల టన్నుల బొగ్గు వనరును మసి చేసిన మనం- మరి కొన్నేళ్లలో ఏటా వంద కోట్ల టన్నుల బొగ్గును భగ్గుమనిపించే స్థాయికి చేరుకోనున్నామన్న అధ్యయన నివేదికలు గుండెల్ని గుభేలుమనిపిస్తున్నాయి. దేశవ్యాప్త విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గును మండించి నడుపుతున్నవేే 72శాతం మేర ఉన్నాయి. బొగ్గు ఆధారిత కేంద్రాల ద్వారా 2023నాటికి దేశంలో 68శాతం విద్యుత్తును ఉత్పత్తి చేయగల స్థితిలో ఉంటామని, అదే 2050కి ఆ పరిమాణం 55శాతానికి తగ్గుతుందని ‘నీతి ఆయోగ్’ ఇటీవలి విడుదల చేసిన నివేదిక చాటుతోంది. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గుపై అతిగా ఆధారపడితే భవిష్యత్తు భయానకమవుతుంది.
బొగ్గుతో నడిచే కేంద్రాలు బొగ్గుపులుసు వాయువు విడుదలకు కారణమవుతున్నాయి. దానివల్ల సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్‌ఓ2), నైట్రస్ ఆక్సైడ్, మెర్క్యూరీ వంటి విష రసాయనాలు గాలిలో చేరి భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. మనిషి బతుకును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ సహా అనేక రకాల తీవ్రమైన శ్వాసకోశ, హృద్రోగ నాడీ సంబంధ, జీర్ణకోశ సమస్యలు చుట్టుముడుతున్నాయి. రసాయన వర్షాలకు, వ్యవసాయ విధ్వంసానికి, పర్యావరణ సమతౌల్యం చిందరవందర కావడానికి బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు కారణమవుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల్లో భారత్‌ది అయిదో స్థానం. మన దేశంలో 64శాతం బొగ్గు విద్యుదుత్పత్తికే ఖర్చవుతోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విస్తరణ చెప్పుకోదగిన స్థాయిలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో- భవిష్యత్తు భయపెడుతోంది. విద్యుత్ ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్న కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానంవల్ల పోగవుతున్న బూడిద పర్యావరణానికి తీరని బెడదగా మారుతోంది.
దేశీయ బొగ్గు ధర తక్కువ కాబట్టి విద్యుత్ కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన బొగ్గు దిగుమతిపై దృష్టి పెట్టడం లేదు. అత్యాధునిక ఇంధన వాయు (ఫ్లుగ్యాస్) శుద్ధి పద్ధతులను ఉపయోగించి చైనా ‘ఎస్‌ఓ2’ను 75శాతం తగ్గించుకోగలుగుతోంది. మరోవంక గతంతో పోలిస్తే భారత్‌లో కాలుష్య ధూమంలో ‘ఎస్‌ఓ2’ పరిమాణం 50శాతం మేర పెరగడం గమనార్హం. వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు, సల్ఫర్ డయాక్సైడ్‌లు విచ్చలవిడిగా వెలువడుతున్న ఈ దురవస్థకు అంతం పలకడమే ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు.
ప్రశ్న:- కర్బన, సల్ఫర్ డయాక్సైడ్ విష ఉద్గారాల విడుదలలో ప్రపంచ దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంటోంది. ఇందుకు కారణాలేమిటి?
క్రిస్టొఫర్ ఒబెర్‌షెల్ఫ్:- ఎస్‌ఓ2 ఉద్గారాల విడుదలకు సంబంధించిన ప్రమాణాలు భారత్‌లో అరకొరగా ఉన్నాయి. బొగ్గు ఆధారిత విద్యుత్ రంగంపై ప్రభుత్వాలకూ ముందు చూపు కొరవడటంతో సమస్య సంక్లిష్టమవుతోంది. నిజానికి ఉద్గారాల విడుదలపై ప్రమాణాలను అంతా అయ్యాక చిట్టచివర రూపొందించిన దేశాల్లో భారత్ ఒకటి. వాయు కాలుష్యాన్ని భారత్ చాలా తేలిగ్గా తీసుకుంది. మరోవంక దేశవ్యాప్తంగా ప్రాంతాలు, స్థాయీభేదాలతో నిమిత్తం లేకుండా వాయుకాలుష్యం ప్రజారోగ్యాన్ని కాటేస్తూనే ఉంది. విస్తృత ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తక్షణం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.
సౌందరమ్ రమంథన్:- బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఎనిమిదో దశకంలో తొలిసారిగా నియంత్రణలు తీసుకువచ్చారు. ప్రజల కనీసావసరాలు తీర్చేందుకు ఏదోరకంగా విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ప్రాథమ్యంగా అప్పటి ప్రభుత్వాలు వ్యవహరించాయి. బొగ్గును మండించిన తరవాత పోగుబడే వ్యర్థ రేణువులు, బూడిదపై మాత్రమే అప్పట్లో నియంత్రణలు విధించారు. క్రమంగా దేశంలో బొగ్గు ఆధారిత భారీ విద్యుత్ కేంద్రాలు విస్తరించాయి. తొమ్మిదో దశకంలో నిబంధనలు పునః సమీక్షించారు. విద్యుత్ ప్లాంట్ల నుంచి కాలుష్య ధూమాన్ని బయటకు పంపే ‘చిమ్నీ’ బాగా ఎత్తుగా ఉండాలని తీర్మానించారు. ‘చిమ్నీ’ ఎంత ఎత్తుగా ఉంటే సల్ఫర్ డయాక్సైడ్, నత్రజని వాయువులు అంత త్వరగా వాతావరణంలో కలిసి పలచబడిపోతాయన్నది నాటి అంచనా. సహస్రాబ్ది తొలి దశలో ప్రైవేటీకరణ ఊపందుకుంది. విద్యుదుత్పత్తిని రెట్టింపు చేయాలన్న లక్ష్యాల నేపథ్యంలో ప్రభుత్వం కాలుష్య ఉద్గారాల విడుదలపై నియంత్రణలను కఠినతరం చేసింది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు 2003నుంచి పర్యావరణ అనుమతులను ప్రభుత్వం తప్పనిసరిగా మార్చింది. నియంత్రణలు పకడ్బందీగా అమలు చేస్తున్న చోట్ల ఉద్గారాలు తగ్గుముఖం పట్టినప్పటికీ- మిగిలిన ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఉద్గారాల విడుదలపై సరికొత్త పరిమితులు విధించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలు, పరిమితుల మాట ఎలా ఉన్నా వాటిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థలు కొరవడితే మాత్రం పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయి.
ప్రశ్న:- కాలుష్య ఉద్గారాల వల్ల తలెత్తే ఆరోగ్య సంబంధ సమస్యలేమిటి?
సీఓ:- వాతావరణంలోకి ఎస్‌ఓ2 విడుదలవల్ల కురిసే ఆమ్ల వర్షాలు చెట్టూచేమకు చేటు తెస్తాయి... అడవులకు కోతపెడతాయి! భవనాల పటిష్ఠతనూ దెబ్బతీస్తాయి. ఎస్‌ఓ2 గాలిలో కలిసి ఏదో ఒక స్థాయిలో ఘనీభవించి, కాలుష్య రేణువులుగా మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ తరహా వాయు కాలుష్యంవల్ల కాలేయ సమస్యలు (కాలేయ క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు వంటివి), గుండెకు సంబంధిత ఇబ్బందులు విస్తరిస్తాయి.
ఎస్‌ఆర్:- సీ-స్టెప్ అనే స్వతంత్ర పరిశోధన సంస్థ ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితే కొనసాగితే 2015-2030 మధ్యకాలంలో 3.2 లక్షల మరణాలు సంభవిస్తాయని, 5.2 కోట్ల మంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరతారని, 126 కోట్ల పనిదినాలు అయిపులేకుండా పోతాయని అది తేల్చింది. అయితే మా అంచనాల ప్రకారం పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉండవచ్చు.
ప్రశ్న:- ఎస్‌ఓ2 పరిమాణం అత్యధికంగా ఉన్న దేశీయ బొగ్గును విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించడమే ఈ సమస్యలకు కారణమా? విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు (ఎస్‌ఓ2 తక్కువ స్థాయిలో ఉన్న)ను ఉపయోగిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందా?
సీఓ:- అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు భారతీయ బొగ్గులో సల్ఫర్ తక్కువగానే ఉంటుంది. అయితే ఇతరేతర కారణాలవల్ల దేశీయ బొగ్గు గరిష్ఠ ఎస్‌ఓ2 ఉద్గారాలకు కారణమవుతోంది. దేశీయ బొగ్గు తాపన విలువ కనిష్ఠం. ఇక్కడి బొగ్గు సులభంగా మండిపోతుంది. దానినుంచి విడుదలయ్యే బూడిద కూడా ఎక్కువే. కాబట్టి మామూలుగా కన్నా ఎక్కువ బొగ్గును మండిస్తే తప్ప విద్యుత్తు తయారుకాని పరిస్థితి! దీనివల్ల దేశంలో వాయు కాలుష్యం పెరుగుతోంది. శుద్ధి చేసిన బొగ్గు(కోల్ వాషింగ్)ను వాడటంవల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. భారతీయ బొగ్గును శుద్ధి చేయడం కష్టం. మరోవంక దేశ విద్యుత్తు కేంద్రాల్లో ఇంధన వాయు శుద్ధి వ్యవస్థలు పరిమితంగా ఉన్నాయి. ఈ వ్యవస్థలు అందుబాటులో ఉంటే సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉన్న బొగ్గునుంచి వెలువడే ఉద్గారాలను 95శాతం మేర తగ్గించవచ్చు.
ఎస్‌ఆర్:- కనిష్ఠ సల్ఫర్, అధిక కెలొరిఫిక్ విలువగల బొగ్గుకు ప్రాధాన్యం ఎక్కువ. దిగుమతి చేసుకున్న బొగ్గులో సల్ఫర్ ఎక్కువగా ఉన్నప్పటికీ- దాని కెలొరిఫిక్ విలువ సైతం గరిష్ఠం కావడం అనుకూలించే విషయం. ఫలితంగా తక్కువ పరిమాణంలో బొగ్గును మండించినా అధిక ఉష్ణం విడుదలవుతోంది. మా పరిశీలన మేరకు విద్యుత్ కేంద్రాల్లో ఏ బొగ్గు (భారతీయ లేదా దిగుమతి చేసుకున్న)ను ఉపయోగించినా విడుదలయ్యే ఉద్గారాల పరిమాణం మాత్రం 1500-2500 ఎం.జి.ల మధ్య ఉంటోంది.
ప్రశ్న:- కొందరు మినహా- విద్యుత్ కేంద్రాల నిర్వాహకులు సాంకేతిక వ్యవస్థలను ఆధునికీకరించుకోవడానికి, పాడుబడిన సాంకేతిక పరికరాలను పక్కనపెట్టి కొత్తవి సమీకరించుకోవడానికి ఎందుకు ఉత్సాహం చూపడం లేదు?
సీఓ:- ఎస్‌ఓ2 ఉద్గారాల విడుదలను తగ్గించే సాంకేతిక వ్యవస్థల ఏర్పాటు అధిక పెట్టుబడులతో కూడుకున్న వ్యవహారం. అందువల్ల అత్యవసరమైతే తప్ప భారతీయ విద్యుత్ మార్కెట్లో ఎవరూ ఈ వ్యవస్థల జోలికి వెళ్ళడం లేదు. మరోవంక భారత్‌లో ప్రభుత్వాలు సైతం ఎస్‌ఓ2 ఉద్గారాలపై కచ్చితమైన నియంత్రణలు అమలు చేయడం లేదు.
ఎస్‌ఆర్:- ఏవో కొన్నింటినీ మినహాయిస్తే దేశంలో పాతతరం విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా లేవు. యాభై శాతం కన్నా తక్కువ సగటు ఉత్పాదక సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాలను కొనసాగించడం లాభదాయకం కాదు. ఈ కేంద్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్తు ధర నూతన ప్లాంట్లలో తయారైన విద్యుత్తు కంటే సగటున 62 పైసలు ఎక్కువగా ఉంటుంది. మొత్తం బొగ్గు ఆధారిత విద్యుత్తులో 2017-’18లో పాతతరం విద్యుత్ కేంద్రాల ద్వారా తయారైంది 16శాతమే. ఆ కేంద్రాలు 30శాతం కాలుష్య ధూళి రేణువులకు, 28 శాతం సల్ఫర్ డయాక్సైడ్‌కు, 33శాతం నత్రజని ఆక్సైడ్ల విడుదలకు కారణమయ్యాయి.
ప్రశ్న:- బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలనుంచి వెలువడే ఉద్గారాలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పర్యావరణంపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఉద్గారాల స్థాయి ఇప్పటికే చేయి దాటిపోయిందంటారా? మరిన్ని విపరిణామాలు చోటుచేసుకోకుండా పరిష్కారాలేవైనా ఉన్నాయా?
సీఓ:- ఏడో దశాబ్దంలో ఐరోపాలో ఇదే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి ఉద్గారాలవల్లే గాలి నాణ్యత దెబ్బతిని అక్కడి దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఆ తరవాత అవి కళ్లు తెరిచి- నిర్దిష్ట పర్యావరణ ప్రమాణాలు, నిబంధనలు రూపొందించుకొని; వాటిని కచ్చితంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించాయి. భారత్ సైతం అదే బాటలో పయనించి పరిస్థితిని చక్కదిద్దుకోవాలి.
ఎస్‌ఆర్:- ప్రభుత్వం నిర్దేశించిన తాజా ప్రమాణాలకు కట్టుబడి భారతీయ విద్యుత్ కేంద్రాలు ఉద్గారాలకు కళ్ళెం వేయాలి. 2017 తరవాత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రమాణాల మేరకు నడుచుకుంటే- కాలుష్య ధూళి రేణువులను 25శాతం, ఎస్‌ఓ2ను 90శాతం, నైట్రోజన్ ఆక్సైడ్‌ను 70శాతం, మెర్క్యూరీని 75శాతం మేర తగ్గించే అవకాశాలున్నాయి.
(మిగతా రేపు)
ఇదీ చూడండి:అధ్యయనం: దేనివల్ల.. ఎంత భూతాపం ?